సింగరేణి: ఎన్నికల నిర్వహణలో అలసత్వం

1 Oct, 2020 10:34 IST|Sakshi

సాక్షి, రామకృష్ణాపూర్‌: సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గుదిబండై కూర్చున్నాయా..? చుట్టూ అల్లుకున్న విమర్శలు.. వైఫల్యాల నుంచి బయట పడాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందా..? కావాలనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియను జాప్యం చేస్తోందా..? అంటే అవుననే అంటున్నారు జాతీయ కార్మిక సంఘాల నేతలు. గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసి ఆర్నెళ్లు కావస్తున్నా.. ఇప్పటివరకు ఎన్నికల ఘట్టానికి సన్నాహాలు మొదలు పెట్టక పోవడాన్ని దీనికి కారణంగా చూపిస్తున్నారు. ఇప్పుడున్న సమస్యలకు తోడు పాలకులు ఇచ్చిన హామీల వ్యవహారం కూడా “ఎక్కడ వేసిన గొంగలి అక్కడే’ అన్న చందంగా మారడం మరో కారణంగా చెబుతున్నారు. 

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఈ ఏడాది ఏప్రిల్‌ 16 నాటికి ముగిసిపోయింది. గత ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ (తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం) విజయం సాధించిన విషయం తెల్సిందే. కాలపరిమితి ముగిసిన వెంటనే గుర్తింపు సంఘం తప్పుకోవాలి. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియ మొదలు కావాలి. ఈ లెక్కన ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీతోపాటు ఎన్నికల ఘట్టం కూడా పూర్తికావాల్సి ఉంది. కానీ.. ఆరునెలలు గడుస్తున్నా.. ఎన్నికల దిశగా అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. వాస్తవానికి ఏప్రిల్‌ 16కు ముందునుంచే వివిధ ఎన్నికల సన్నాహాలను సింగరేణి   యాజమాన్యం చేపట్టాల్సి ఉంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో యాజమాన్యం ముందుకు రాలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు సుముఖత చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

సింగరేణి బాండ్ల తనఖా
ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణ అంటే అటు సింగరేణి కాలరీస్‌ సంస్థకు ముచ్చెమటలు పట్టించే చర్యగా కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజమాన్యం ఎన్నికలు నిర్వహించడానికి చేతులెత్తేసే గడ్డుస్థితిలోకి జారిపోయింది. వివిధ రకాల ఆర్థిక సంక్షోభాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. లాభాల బాటలో ఉన్న సంస్థ ఆదాయాన్ని వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని సమాచారం. అలాగే సంస్థకు చెందిన పలు బాండ్లను కూడా అవసరాల నిమిత్తం తనఖా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్మికులు, ఉద్యోగులకు కనీసం వేతనాలు చెల్లించడానికి కూడా యాజమాన్యం ముప్పుతిప్పలు పడాల్సిన దుస్థితి పట్టింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ అంత సులువైన పని కాదని ఉన్నతాధికారులకు తేలిపోయింది. అందుకే ఎన్నికలకు సాహసించడం లేదని నాయకులు కరాఖండిగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాదైనా ఎన్నికలకు ముందుకొచ్చే పరిస్థితి లేకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 

వివిధ హామీలతోనే పరేషాన్‌..!
ఆర్థిక పరమైన అంశాలను పక్కన పెడితే.. వివిధ కారణాల రీత్యానూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియపై ఆచీతూచీ అడుగేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్‌ తొలుత సింగరేణి సంస్థపై అనేక వరాలు కురిపించారు. సంస్థలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, 25 కొత్త బొగ్గు బ్లాకులు తెరిపిస్తామని, కొత్త భూగర్భగనులు ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇవేవీ ఆచరణలో పెట్టలేదన్న అపవాదు ప్రభుత్వంపై ఉంది. కారుణ్య నియామకాల తతంగం ఓ ఫార్స్‌గా నడుస్తున్నదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణాలతోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికలకు సుముఖంగా లేదని నాయకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 65వేల మంది ఉన్న ఉద్యోగుల సంఖ్య నేడు 45 వేలకు చేరింది. కొత్త గనులు కనుచూపు మేరలోనూ లేకుండా పోయాయన్న వేదన కార్మికుల్లో, కార్మిక కుటుంబాల్లో రగులుతోంది. 

ఇప్పటికే ఆరు నెలల జాప్యం..
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఇప్పటికే ఆరు నెలలు జాప్యం అయిపోయింది. 2017 అక్టోబర్‌ 5న జరిగినప్పటికీ టీబీజీకేఎస్‌లోని గ్రూపు తగాదాల కారణంగా గుర్తింపు సంఘ బాధ్యతల్ని ఆలస్యంగా చేపట్టింది. అక్టోబర్‌ 2017లో ఎన్నికలు జరిగితే 2018 ఏప్రిల్‌ 16న బాధ్యతలు తీసుకుంది. ఈ లెక్కన తీసుకున్నా ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆరు నెలల జాప్యాన్ని అటు సింగరేణి యాజమాన్యం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించాయి. ఆరు నెలలు ఆలస్యంగా బాధ్యతలు చేపట్టామని జాప్యం చేస్తున్నారా..? లేదంటే ఇరుపక్షాలపై ముసురుకుంటున్న విమర్శల నేపథ్యంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారా..? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా ఎన్నికల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడం తమకు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టినట్లేనని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు