Indira park: లవర్స్‌కు షాక్‌, వెంటనే వెనక్కి తగ్గిన అధికారులు

26 Aug, 2021 19:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరం హైదరాబాద్‌లో ప్రముఖ పార్క్‌లోకి పెళ్లికాని జంటలను నిషేధించే ఉత్తర్వుల బోర్డు కలకలం సృష్టించింది. ‘‘పెళ్లి కాని జంటలకు పార్కులోనికి ప్రవేశం లేదు” అంటూ తాజాగా ఇందిరా పార్కు యాజమాన్యం ఒక బోర్డు పెట్టింది. పార్క్ మేనేజ్‌మెంట్ కొత్త మోరల్‌ పోలీసింగ్‌ వ్యవహారం దుమారాన్ని రేపింది.  

పరోక్షంగా ప్రేమికులకు ప్రవేశం లేదన్నట్టు హుకుం జారీ చేయ‌డంపై సోషల్‌ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తాలిబన్లు ఎక్కడో వేరే దేశంలో లేరు, మన చుట్టూనే వున్నారు, కావాలంటే వెళ్లి చూడండి హైదరాబాద్ ఇందిరాపార్క్‌కి అంటూ ఈ నిర్ణయంపై మ‌హిళా ఉద్యమకారులు మండిప‌డ్డారు. పబ్లిక్ పార్క్ అనేది లింగభేదం లేని జంటలతో సహా చట్టాన్ని గౌరవించే పౌరులందరికీ  అనుమతినిచ్చే ప్రదేశం.  పార్క్‌లోకి ప్రవేశానికి 'వివాహం' ఎలా ప్రామాణికంగా ఉంటుందంటూ యాక్టివిస్ట్‌  మీరా సంగమిత్రా ఆగ్రహం వ్యక‍్తం చేశారు. 

చదవండి :  తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!?

ముఖ్యంగా హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్‌ అంటే  చాలా ఫ్యామస్‌.  ఈ పార్క్‌ను సందర్శించే వారిలో పిల్లలు, ప్రేమికుల సంఖ్య ఎక్కువ. మరీ ముఖ్యంగా  మార్నింగ్‌ వాక్‌కు వచ్చే వారితో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అందులోనూ ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన ప్రత్యక అభివృద్ది కార్యక్రమాలతో మరింత సందడి నెలకొంది. అయితే తాజాగా ప్రేమ జంటలకు షాక్ ఇవ్వడంపై భారీ వ్యతిరేకత రావడంతో ఈ బోర్డును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ మరో బోర్డు తగిలించింది. అయితే పార్క్‌ ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తూ తగిన శ్రద్ధ వహించాలని కోరినట్టు తెలిపింది. మరోవైపు ఇందిరా పార్కుతోపాటు, నగరంలోని ఇతర ప్రముఖ పార్కుల్లో కూడా ఇలాంటి ఆదేశాలే అమల్లోకి రానున్నాయంటూ సోషల్‌ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక‍్తం కావడవం గమనార్హం.

చదవండి : Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి

మరిన్ని వార్తలు