బలవంతపు చర్యలొద్దు.. విద్యుత్‌ బకాయిల చెల్లింపులపై హైకోర్టు ఆదేశం

29 Sep, 2022 03:17 IST|Sakshi

కేంద్రం, ఏపీ కౌంటర్‌ దాఖలు చేయాలన్న ధర్మాసనం

విచారణ వచ్చే నెల 18కి వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: రూ.6,756.92 కోట్లు విద్యుత్‌ బకాయిలకు సంబంధించి తెలంగాణపై బలవంతపు చర్యలొద్దని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదంది. కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 30 రోజుల్లోగా ఏపీకి రూ.6,756.92(అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) కోట్లు చెల్లించాలంటూ ఆగస్టు 29న కేంద్రం తెలంగాణకు నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ శ్రీనివాస్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కారణంగా ఉత్పన్నమయ్యే స మస్యలపై ముందు చర్చించాలని చెప్పారు. దీనిపై పూర్తిగా చర్చించకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు.

కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు 
ఏపీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ కేంద్రానికి సహకరించిందని, అందుకే ఆ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని నివేదించారు. ఇతర రాష్ట్రాల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పుడు, కేంద్రం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు.

తెలంగాణ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ పవర్‌ డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. మౌలిక వసతుల కల్పన కోసం ఏపీ డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి లోన్లు తీసుకున్నాయని వెల్లడించారు. పునర్విభజన తర్వాత విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా చేసినందుకు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనికి పునర్విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

కేంద్రం తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్‌ సరఫరా చేసిందని నివేదించారు. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. బకాయిల చెల్లింపు కోసం తెలంగాణను ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. 

మరిన్ని వార్తలు