టెన్త్‌లో పేరుకే పరీక్ష.. ఫీజు మినహాయింపు!

10 Feb, 2021 08:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా పేరుకే ఫీజు మినహాయింపు ప్రకటిస్తోంది తప్ప అమలు చేసే వీలు కల్పించట్లేదు. పొంతనలేని ఆదాయ పరిమితిని విధించడంతో పరీక్ష ఫీజు మినహాయింపును విద్యార్థులు పొందలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, పట్టణాల్లో రూ.24 వేలలోపు వార్షికాదాయం ఉన్న వారికే ఫీజు మినహాయింపు వర్తిస్తుందన్న నిబంధనతో దాదాపు 2.5లక్షల మంది నిరుపేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరట్లేదు.

రాష్ట్రంలో ఏ పథకమైనా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఇందుకు గరిష్ట వార్షిక ఆదాయం రూ.లక్షకు పైనే ఉంది. కానీ పదో తరగతి పరీక్ష ఫీజు మినహాయింపునకు ప్రత్యేక వార్షికాదాయాన్ని కొనసాగిస్తోంది. 2015లోనే దీన్ని మార్చాలని ప్రభుత్వ పరీ క్షల విభాగం అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినా మార్పు లేదు. ఇప్పుడు అదే నిబంధన కొనసాగిస్తూ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఖరారు చేసింది. దీంతో పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఈ మినహాయింపు వర్తించే అవకాశం లేకుండా పోయింది.

మరిన్ని వార్తలు