ఉల్లి: ఒక్క ఎకరాలోనూ పంట వేయని రైతులు

8 Feb, 2021 09:32 IST|Sakshi

‘మద్దతు’ లేక, ఇతర కారణాలతో అనాసక్తి

యాసంగిలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 21,869 ఎకరాలు

గత ఏడాది 9,536 ఎకరాల్లో సాగు

50 లక్షల ఎకరాలు దాటిన యాసంగి పంటల సాగు

సాక్షి, హైదరాబాద్‌/జోగుళాంబ గద్వాల/ వరంగల్‌ రూరల్‌: ఉల్లి విషయంలో తెలంగాణ ఇప్పటికీ ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా, ఇక్కడ ఉల్లికి రెక్కలు వస్తాయి. నల్లబజారుకు వెళ్లడమే కాకుండా అధిక ధర పలుకుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉల్లి సాగును ప్రోత్సహించాలని మూడు నాలుగేళ్లుగా అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. కానీ అవి ఫలితాలు ఇవ్వకపోగా, పరిస్థితి మరింత దారుణంగా మారింది.

ప్రస్తుత యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో రైతులు ఒక్క ఎకరాలో కూడా ఉల్లి సాగు చేయకపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రతి ఏడాది యాసంగిలో రాష్ట్రంలో ఎంతోకొంత సాగవుతున్నా, ఈసారి ఒక్క ఎకరాలోనూ వేయలేదు. యాసంగిలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 21,869 ఎకరాలు కాగా, గతేడాది 9,536 ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది ఒక్క ఎకరాలోనూ సాగు లేదని వ్యవసాయ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ సమయానికి సాధారణంగా 9,405 ఎకరాల్లో ఉల్లి సాగవ్వాలి. కానీ రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించడంలేదని ఉద్యాన శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

నెలకు 42,400 మెట్రిక్‌ టన్నులు అవసరం
మార్కెట్‌ అంచనా ప్రకారం ప్రతి ఏడాది రాష్ట్రంలో 5.08 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లిగడ్డ అవసరం పడుతుంది. అంటే నెలకు 42,400 మెట్రిక్‌ టన్నులు. అయితే ఉల్లి విత్తనాలకు రాయితీ కల్పించకపోవడం, మద్దతు ధర లేకపోవడం, సరైన మార్కెటింగ్‌ సౌకర్యాలు సృష్టించకపోవడంతో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపడం లేదు. అంతేగాక ఉత్పాదకత అత్యంత తక్కువగా ఉండటం, నాణ్యమైన విత్తనాలకు ఎక్కువ ధర పలకడం, చీడపీడల బెడద అధికంగా ఉండటం, వాటికి అవసరమైన ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశాన్ని అంటడం, వాటి ధరల నిర్ధారణ పూర్తిగా మాఫియా చేతుల్లోనే ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితి నెలకొంటోందని మార్కెటింగ్‌ శాఖ ఇటీవల ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపింది. 

39.26 లక్షల ఎకరాల్లో వరి సాగు
యాసంగి పంటల సాగు విస్తీర్ణం రాష్ట్రంలో భారీగా పెరిగింది. సాగునీటి వనరులు పెరగడంతో సాగు పెరిగినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.  ఈ సీజన్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 36.93 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే ఏకంగా 50.35 లక్షల ఎకరాలకు చేరుకోవడం విశేషం. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 136.34 శాతం అధికంగా పంటలు సాగయ్యాయి. అన్ని పంటల కంటే వరి విస్తీర్ణం ఎక్కువగా పెరగడం (176.93%) విశేషం. యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం కంటే 176.93% అధికంగా నాట్లు పడడంపై వ్యవసాయ శాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పప్పు ధాన్యాల విస్తీర్ణం కూడా పెరిగింది. సాధారణ సాగు విస్తీర్ణం 3.03 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.73 లక్షల (122.71%) ఎకరాల్లో సాగయ్యాయి. ఇక నూనె గింజల సాధారణ సాగు విస్తీర్ణం 3.73 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.50 లక్షల (66.95%) ఎకరాల్లో సాగైంది.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 215% సాగు
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లాలో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 79,867 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.72 లక్షల (215.83%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 76,467 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.51 లక్షల (198.35%) ఎకరాల్లో సాగు జరిగింది. అత్యంత తక్కువగా కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సాగైంది. ఆ జిల్లా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 26,488 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 21,223 (80.12%) ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి.

యాసంగిలో పంటల 
సాగు వివరాలు (లక్షల ఎకరాలు)
పంట    సాధారణం    సాగైంది

వరి    22.19    39.26
శనగ    2.48    2.96
వేరుశనగ    3.05    1.90
మొక్కజొన్న    4.04    3.16
జొన్న    0.67    0.92 

ధర వస్తుందో, రాదోనని..
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు సింగిరెడ్డి మొగిలి. వరంగల్‌ రూరల్‌ జిల్లా సం గెం మండలం నార్లవాయికి చెందిన ఈయన ఏటా 20 గుంటల భూమిలో ఉల్లి సాగు చేస్తాడు. గతేడాది పంట కుళ్లు తెగులు, మార్కెట్‌ సౌకర్యం, ధర లేకపోవడం, అధిక వర్షాల తో నష్టపోయిన ఈయన ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతో సాగుకు ఆసక్తి కనబర్చలేదు. కేవలం 10 గుంటల భూమిలోనే ఉల్లి సాగుకు పెట్టుబడి పెట్టానని చెప్పాడు.

గతేడాది రూ.3 లక్షలు నష్టపోయా
గత యాసంగిలో 4 ఎకరాలు, ఖరీఫ్‌లో 2 ఎకరాలు సాగు చేశాను. ఖరీఫ్‌లో సాగుచేసిన పంట క్వింటాల్‌ రూ.600 కు అమ్మాను. మార్కెటింగ్‌ లేక, వర్షాల వల్ల రెండు సీజన్లలో ఉల్లి సాగుచేసి రూ.3 లక్షల వరకు నష్టపోయాను. ధర నిలకడగా లేకపోవడంతో ఈ ఏడాది యాసం గిలో నాతో పాటు మా గ్రామంలోని 30 మంది రై తులు ఉల్లి జోలికి వెళ్లలేదు. ఉల్లికి కూడా ప్రభుత్వం మద్దతు ధరనివ్వాలి. – ఖాజామియా, కొంకల, 
వడ్డేపల్లి మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా

వర్షం ఎక్కువై సాగు చేయలేదు
పోయినేడాది మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. ఈ ఏడాది కూడా సాగు చేసేందుకు రూ.10వేలతో ఉల్లి విత్తనాలు తెచ్చి, 25 నార బేడ్లు పోశాను. దురదృష్టం కొద్దీ వర్షం ఎక్కువగా కురిసింది. పొలంలో గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. సరైన సమయానికి కూలీలు దొరకకపోవడంతో పొలం బీడుగా మారింది. 
– మద్దిలేటి, గోకులపాడు,  మానవపాడు మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా

చదవండి: పాలకూర మొక్కలతో ఈ–మెయిళ్లు పంపొచ్చు!

మరిన్ని వార్తలు