జోరు వానల్లో హైదరా‘బాధ’లు.. వరద, మురుగు పరుగెటు? దశాబ్దాల నిర్లక్ష్యానికి కంపే సాక్ష్యం!

15 Jul, 2022 11:37 IST|Sakshi

బస్తీలను ముంచెత్తిన వరద, మురుగు 

వరుస వర్షాలతో తప్పని ఇబ్బందులు

దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం 

సాక్షి, సిటీబ్యూరో: ఐటీ హబ్‌కు కేరాఫ్‌గా మారిన గ్రేటర్‌ సిటీ.. విశ్వనగరం బాటలో దూసుకెళుతున్నా.. మురుగు, వరదనీరు సాఫీగా వెళ్లే దారి లేక కంపుకొడుతోంది. గత వారం రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సుమారు 200కు పైగా బస్తీలను మురుగు, వరదనీరు ముంచెత్తింది. దీంతో ఆయా బస్తీలవాసులు రోగాల బారినపడుతున్నారు. వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ దుస్థితికి పరిష్కారం లభించడంలేదు. ఏళ్లుగా నాలాలు విస్తరించకపోవడం, స్మార్ట్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఏటా పరిస్థితి విషమిస్తోంది. 

మురుగుకు మోక్షం కల్పించాలిలా.. 
గ్రేటర్‌ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు.. జనాభా కోటి దాటింది. నగరంలో నిత్యం 1400 మిలియన్‌ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో 700 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిని జలమండలి 23 ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా మురుగు నీరు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే సమీప చెరువులు, మూసీలో కలుస్తోంది. 

2007లో జీహెచ్‌ఎంసీలో విలీనమైన 11 మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ ఔట్‌లెట్‌ సదుపాయం లేకపోవడంతో మురుగు నీరు సెప్టిక్‌ ట్యాంకులు, బహిరంగ ప్రదేశాలు, ఓపెన్‌ నాలాలు, చెరువులు, కుంటలను ముంచెత్తుతోంది. ఆయా మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో రూ.3723 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 2 వేల కిలోమీటర్ల మార్గంలో డ్రైనేజి పైపులైన్‌ వ్యవస్థ ఏర్పాటుచేయాల్సి ఉంది. ఈ పైపులైన్ల ద్వారా మురుగు నీటిని నూతనంగా రూ.1046 కోట్లతో నిర్మించనున్న 17 ఎస్టీపీల్లోకి మళ్లించి శుద్ధి చేసిన అనంతరమే మూసీ, నాలాల్లోకి వదిలిపెట్టాలి. మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేసిన నీటిని గార్డెనింగ్, పారిశ్రామిక, నిర్మాణరంగ అవసరాలు, కార్‌వాషింగ్, ఫ్లోర్‌ క్లీనింగ్‌ తదితర అవసరాలకు వినియోగించాలి. 

వరద కష్టాలు లేకుండా..  
గ్రేటర్‌ మొత్తానికీ సమగ్ర మాస్టర్‌ప్లాన్‌.. సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్‌వర్క్‌ ప్లాన్‌.. మేజర్, మైనర్‌ వరద కాల్వల ఆధునికీకరణకు గతంలో ఓయంట్స్‌ సొల్యూషన్‌ సంస్థ సిద్ధం చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం పనులు చేపట్టాలి. నగరంలో 1500 కి.మీ మేర విస్తరించిన నాలాలపై ఉన్న 10 వేల అక్రమ నిర్మాణాలను తొలగించాలి. నాలాలను సమూలంగా ప్రక్షాళన చేయాలి. విస్తరించాలి. నాలాల ఆధునికీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ఇందుకోసం రాజకీయ పార్టీలు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. 

వరద నీటి కాల్వల్లో మురుగునీరు పారకుండా జలమండలికి స్పష్టమైన ఆదేశాలివ్వాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజి (వరదనీటి కాల్వల) మాస్టర్‌ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 185 చెరువుల పునరుద్ధరణ చేపట్టాలి. దీంతో వర్షపు నీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటాయి.

చదవండి: రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ

మరిన్ని వార్తలు