ఓయూలో రాహుల్‌ గాంధీ సభకు నో పర్మిషన్‌: ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌

1 May, 2022 03:08 IST|Sakshi

రాహుల్‌ సభకు అనుమతి నిరాకరణ

ఎలాంటి సమావేశాలకూ అనుమతి లేదన్న ఓయూ వీసీ

కెమెరాలను నిషేధిస్తున్నట్టు ప్రకటన

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఉస్మానియా యూనివర్సిటీలో మే 7న నిర్వహించ తలపెట్టిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సభకు ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ అనుమతి నిరాకరించారు. రాహుల్‌ సభ కోసం విద్యార్థి సంఘాల నుంచి అందిన వినతిపత్రానికి సంబంధించి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించిన మీదట వీసీ శనివారం ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ఓయూలో సభలు సమావేశాలు, రాజకీయ సమ్మేళనాలకు అనుమతులు ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఆ నిర్ణయం మేరకే రాహుల్‌గాంధీ సభకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు వివరించారు. రాహుల్‌ సభకే కాకుండా ఓయూలో ఎటువంటి సభలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసిన అధికారులు.. క్యాంపస్‌లో కెమెరాలను కూడా నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్‌ సర్కారుపై పోరులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్‌ మే 6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభను నిర్వహించనుంది. ఆ మరుసటి రోజు ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద సభ నిర్వహించి, రాహుల్‌గాంధీతో విద్యార్థుల ముఖాముఖి ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించగా వీసీ అనుమతి నిరాకరించారు. 

వీసీపై విద్యార్థి నేతల ఆగ్రహం
రాహుల్‌ సభకు అనుమతి నిరాకరించడం ఓయూలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. వీసీని కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్‌ కళాశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చనగాని దయాకర్‌గౌడ్, లోకేశ్‌యాదవ్, శ్రీధర్‌గౌడ్, కుర్వ విజయ్‌ తదితరులు మాట్లాడుతూ.. నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

చదవండి: రాహుల్‌ సభ.. రైతుల కోసమే!

మరిన్ని వార్తలు