పన్ను బకాయిలుంటే నో రిజిస్ట్రేషన్‌

10 Sep, 2020 02:57 IST|Sakshi

పురపాలికలు, జీహెచ్‌ఎంసీ చట్టాలకు కీలక సవరణలు

 శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం

రిజిస్ట్రేషన్‌ సమయంలోనే తక్షణంగా మ్యుటేషన్‌

సాక్షి, హైదరాబాద్‌:  ఆస్తి పన్నులు/ఖాళీ స్థలాలపై విధించే పన్నులు, కులాయి బిల్లులు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు లేవని ధ్రువీకరణ పత్రం లేదా ఇప్పటివరకు వీటిని చెల్లించిన రశీదులను సమర్పిస్తేనే ఇకపై స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌తో పాటు యాజమాన్య హక్కుల బదిలీ(మ్యుటేషన్‌)ను జరపనున్నారు. అవి లేకుంటే వారసత్వంగా గానీ, అమ్మకం ద్వారా గానీ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ జరగదు. రిజిస్ట్రేషన్‌ సమయంలోనే తక్షణంగా మ్యుటేషన్‌ చేయనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర పురపాలికల చట్టం, హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ చట్టాలను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టింది. అమ్మకం, దానం, తనఖా, విభజన, వినిమయం అవసరాలకు స్థిరాస్తులను రిజిస్ట్రేషన్‌ చేసే సమయంలోనే ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా మ్యుటేషన్లు చేసే అధికారాన్ని సబ్‌ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం అప్పగించింది. మ్యుటేషన్‌ చేసేందుకు ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్‌) లేదా వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ నంబర్‌(వీఎల్‌టీఎన్‌) సైతం కొత్త యజమాని పేరుకు బదిలీ కానుంది. మ్యుటేషన్‌ ఫీజును సబ్‌ రిజిస్ట్రార్లు వసూలు చేసి ఆస్తి యజమానికి మ్యుటేషన్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పురపాలక శాఖకు మ్యుటేషన్‌ దరఖాస్తు వెళ్లనుంది. 

మరిన్ని వార్తలు