ఏం చేసేది? ఎఫ్‌సీఐకి తలనొప్పిగా మారిన బియ్యం

21 Apr, 2021 04:56 IST|Sakshi

బియ్యం నిల్వలకు చోటేదీ?

ఎఫ్‌సీఐ గోదాముల్లో పేరుకుపోతున్న బాయిల్డ్‌ రైస్‌ నిల్వలు

గతేడాది యాసంగికి సంబంధించి 13 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఎఫ్‌సీఐ వద్దే..

వానాకాలానికి సంబంధించి సైతం మరో 5.5 లక్షల టన్నుల నిల్వలు త్వరలో రాక

ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వసామర్థ్యం 15.8 లక్షల టన్నులు మాత్రమే

బాయిల్డ్‌ రైస్‌ దిగుమతులను పూర్తిగా తగ్గించిన తమిళనాడు, కేరళ

అందుకే రా రైస్‌ను ఎక్కువగా ఇవ్వాలని రాష్ట్రానికి సూచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల్లో బియ్యం నిల్వలకు చోటు కరువైంది. బాయిల్డ్‌ రైస్‌ వినియోగం ఎక్కువగా ఉండే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు పూర్తిగా తమ పరిధిలోనే ఉత్పత్తి పెంచడం, దీనికితోడు రా రైస్‌ (పచ్చి బియ్యం) వినియోగం వైపు అధికంగా మొగ్గుచూపుతుండటంతో ఇక్కడి గోదాముల నుంచి సరఫరా తగ్గి నిల్వలు పెరుగుతున్నాయి. దీనికితోడు కొత్తగా గత ఖరీఫ్‌కు సంబంధించి మరో ఐదున్నర లక్షల టన్నుల మేర బాయిల్డ్‌ రైస్‌ రావాల్సి ఉంది. యాసంగికి సంబంధించి కూడా భారీగా వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి ఇచ్చిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) చేసిన అనంతరం ఎఫ్‌సీఐ దాన్ని సేకరించి తన పరిధిలోని గోదాముల్లో నిల్వ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ పరిధిలో 15.8 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములున్నాయి.

ప్రతి యాసంగి సీజన్‌కు సంబంధించిన బాయిల్డ్‌ రైస్‌ను ఎక్కువగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ సరఫరా చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాల నుంచి బాయిల్డ్‌ రైస్‌కు డిమాండ్‌ పడిపోయింది. రాష్ట్రంలో 2019–20 యాసంగి సీజన్‌కు సంబంధించి 40 లక్షల బాయిల్డ్‌ రైస్‌ ఎఫ్‌సీఐకి చేరగా, ఇందులో 27 లక్షల మెట్రిక్‌ టన్నులను వివిధ రాష్ట్రాలకు పంపించింది. ఇందులో మరో 13 లక్షల టన్నులు ఎఫ్‌సీఐ గోదాముల్లోనే ఉన్నాయి. దీనికితోడు 2020–21 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 5.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఇది వస్తే నిల్వలు మరింత పెరగనున్నాయి. ఇది పోనూ ప్రస్తుత యాసంగిలోనూ 80 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే దాదాపు ఈ సీజన్‌లో 50 లక్షల టన్నులకు పైగా బాయిల్డ్‌ రైస్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ స్థాయిలో నిల్వలు చేసే పరిస్థితి ఎఫ్‌సీఐ వద్ద లేదు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ నెలకు సగటున 2.50 లక్షల నుంచి 3 లక్షల టన్నుల మేర పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. ఈ లెక్కన ఏడాదంతా సరఫరా చేసిన 36 లక్షల టన్నులకు మించి సరఫరా చేయలేదు. అలాంటప్పుడు మిగతా బియ్యాన్ని నిల్వ చేయడం ఎఫ్‌సీఐకి ‘కత్తిమీద సాము’లా మారనుంది.

బాయిల్డ్‌ వద్దంటున్న పొరుగు రాష్ట్రాలు
తమిళనాడుకు ప్రతి నెలా 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులు, కేరళకు ప్రతినెలా 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ అవసరాలుండేవి. దీనికి తగ్గట్లుగా తెలంగాణ నుంచి సేకరించిన బియ్యం సరఫరా అయ్యేది. ప్రస్తుతం తమిళనాడులో 3 లక్షల టన్నులకు అవసరాలు తగ్గాయి. తన అవసరాలకు సరిపోనూ బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తిని స్వతహాగా పెంచుకుంటోంది. దీంతో తెలంగాణపై ఆధారపడే పరిస్థితి లేదు. ఇక కేరళలోనూ బాయిల్డ్‌ రైస్‌ వినియోగం 30 శాతం తగ్గి రా రైస్‌ వినియోగం పెరిగింది. దీంతో ఆ రాష్ట్రాల నుంచి బాయిల్డ్‌ డిమాండ్‌ తగ్గింది. కర్ణాటకలో పూర్తిగా రా రైస్‌ వినియోగం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుత యాసంగిలో పూర్తిగా రా రైస్‌ మాత్రమే ఇవ్వాలని ఎఫ్‌సీఐ రాష్ట్రాన్ని కోరింది. అయితే ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్‌ రైస్, 20 శాతం రా రైస్‌ తీసుకోవాలని ఎఫ్‌సీఐని కోరింది. దీనిపై ఎఫ్‌సీఐ నిర్ణయం వెలువడాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు