పసుపు బోర్డు కలేనా?

22 Mar, 2021 10:48 IST|Sakshi
ఫైల్ ఫోటో

సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోనే పసుపు 

పార్లమెంట్‌ ఉభయ సభల్లో కేంద్ర మంత్రుల స్పష్టీకరణ

బోర్డు ఏర్పాటు చేస్తేనే మేలు అంటున్న రైతులు

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): పసుపు రైతుల చిరకాల స్వప్నమైన పసుపు బోర్డు ఏర్పాటుకు బ్రేక్‌ పడినట్లేననే వాదన వినిపిస్తోంది. కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్, సహాయ మంత్రి పురుషోత్తం రూపాలలు పసుపు బోర్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా పసుపు పంట సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోనే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పసుపు సుగంధ ద్రవ్యాల బోర్డులో ఒక భాగమని వెల్లడవుతుంది. కానీ పసుపు పంటకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు కొన్నేళ్ల నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే వివిధ రాజకీయ పక్షాలు పసుపు బోర్డు ఏర్పాటుపై హామీ ఇచ్చాయి. ఈక్రమంలో కేంద్రం ప్రకటనతో పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తే.. 
పొగాకు బోర్డు, మిర్చి బోర్డుల తరహాలోనే ³సుపు బోర్డు ఏర్పాటు చేస్తే పంట సాగు విస్తీర్ణంను నియంత్రించడంతో పాటు మినిమం సపోర్టు ప్రైస్‌(ఎంఎస్‌పీ)ని ప్రకటించడం లేదా మద్దతు ధరను అమలు చేయడం జరుగుతుంది. అలాగే పసుపు సాగు చేసే రైతులకు మెళుకువలను తెలియజెప్పి నాణ్యమైన పంటను సాగు చేయించడం జరుగుతుంది. పసుపు సాగు మొదలుకొని మార్కెటింగ్‌ వరకు పసుపు బోర్డు కనుసన్నలలోనే సాగుతుంది. పసుపు బోర్డు ఏర్పాటు జరిగితే తమకు ఎలాంటి నష్టం కలుగదని పైగా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని రైతులు చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా సాగు అయ్యే పసుపు పంటలో 80 శాతం పసుపు నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్‌ జిల్లాల్లోనే సాగు అవుతుంది. అందువల్ల నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ప్రధానంగా వినిపిస్తుంది. పసుపు బోర్డు సాధనే లక్ష్యంగా 2019 పార్లమెంట్‌ సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్‌ స్థానం నుంచి అత్యధిక సంఖ్యలో రైతులు పోటీ చేసిన విషయం విదితమే. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోను ఇక్కడి రైతులు కొందరు పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్‌తో పోటీ చేశారు. పసుపు బోర్డు విషయంలో కేంద్రం స్తబ్దంగా ఉండటం, రైతులు పట్టు వీడకపోవడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

బీజేపీ నేతలు వంచించారు
పసుపు బోర్డు ఏర్పాటు విషయమై బీజేపీ నేతలు రైతులను వంచించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామ ని పార్లమెంట్‌ ఎన్నికల్లో హా మీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు. పసుపు బోర్డు సాధించేవరకు మేము నిద్రపోం.
– పవన్, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్, మోర్తాడ్‌

రైతుల ఆకాంక్షను నెరవేర్చాలి
రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలి. రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు. రైతుల ఆశయాలను సాకా రం చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉంది. బీజేపీ నాయకత్వం చొరవ తీసుకుని పసుపు బోర్డును ఏర్పాటు చేయించాలి.
– తక్కూరి సతీష్, మోర్తాడ్‌

పసుపు బోర్డు ఏర్పాటు అవసరం లేదు: పురుషోత్తమ్‌ రూపాలా

మరిన్ని వార్తలు