ముహూర్తాల్లేవ్‌.. శుభకార్యాలకు బ్రేక్‌

22 Aug, 2022 15:44 IST|Sakshi

నేటి నుంచి డిసెంబర్‌ 2 వరకు ఇదే పరిస్థితి

మళ్లీ అదే నెల 3 నుంచి 10 రోజులే ముహూర్తాలు

సాక్షి, విద్యానగర్‌(కరీంనగర్‌): శ్రావణంలో 15 రోజులపాటు భాజాభజంత్రీలు మోగగా సోమవారం నుంచి డిసెంబర్‌ 2 వరకు ముహూర్తాలు లేవు. తిరిగి డిసెంబర్‌ 3 నుంచి 19వ తేదీ వరకు పది ముహూర్తాలే ఉన్నాయి. అప్పటివరకు శుభకార్యాలకు ఆగాల్సిందే. ఈ నెల 24వ తేదీ పవిత్ర శ్రావణ బహుళ ద్వాదశీ బుధవారం పునర్వసు నక్షత్రంతో పెళ్లిళ్లు కాకుండా ఇతర కార్యక్రమాలకు సంబంధించి మంచిరోజులూ ముగుస్తాయి.

సెప్టెంబర్‌ 17 నుంచి శుక్ర మౌఢ్యమి
సెప్టెంబర్‌ 17 భాద్రపద బహుళ సప్తమి నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభమై అక్టోబర్‌లో వచ్చే అశ్వయుజ, నవంబర్‌లో వచ్చే పావన కార్తీక మాసాల్లోనూ కొనసాగుతుంది. మార్గశిర శుద్ధ దశమి డిసెంబర్‌ 2న ఇది ముగుస్తుంది.

డిసెంబర్‌ 24 నుంచి పుష్యమాసం
పుష్యమాసం డిసెంబర్‌ 24 నుంచి ప్రారంభమై జనవరి 21వ తేదీ వరకు ఉంటుంది ఈ రోజుల్లో శుభముహ్తూరాలు లేవు. తిరిగి జనవరి 22 నుంచి మాఘమాసం ప్రారంభమై, మార్చి 19 వరకు వరుసగా అన్నీ మంచి రోజులే. వివాహాది, సమస్త శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు.  

ఈ నెల చివరలో పండుగలు 
►25న మాసశివరాత్రి 
►27న పొలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది.
►30న కుడుముల తదియ 
►31న వినాయక చతుర్థి, నవరాత్రోత్సవాలు ప్రారంభం
►సెప్టెంబర్‌ 9న నిమజ్జనోత్సవం.

అస్తమించని మౌఢ్యం..
శుక్రాస్తమయం అస్తమించిన మౌఢ్యమని, దీన్నే శుక్ర మౌఢ్యమి అని అంటారు. ఇది ఉన్న కాలంలో గ్రహాలు çశుభ ఫలితాలు ఇవ్వవు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టవద్దు. కొత్తగా ఎలాంటి పనులు ప్రారంభించకూడదు. 
– మంగళంపల్లి శ్రీనివాసశర్మ, నగర వైదిక పురోహితుడు, కరీంనగర్‌ 

డిసెంబర్‌లోనే ముహూర్తాలు..
శ్రావణంలో శుభకార్యాలకు ముహూర్తాలు సోమవారంతో ముగుస్తాయి. మళ్లీ డిసెంబర్‌ వచ్చే మార్గశిర వరకు ఆగాల్సిందే. ఆ నెలలోనూ కేవలం 10 రోజులే ముహూర్తాలున్నాయి. మళ్లీ జనవరి 22 నుంచి మాఘమాసంలో ఉంటాయి.  
– పవనకృష్ణ శర్మ, ప్రధానార్చకుడు, శ్రీదుర్గాభవాని ఆలయం, నగునూర్, కరీంనగర్‌                                            

మరిన్ని వార్తలు