కునుకు లేకుండా కట్టడి.. నిద్ర లేని రాత్రులు 45!

17 Jun, 2021 12:51 IST|Sakshi

ఫలించిన నోడల్‌ అధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌ పనితీరు

కంటిపై కునుకు లేకుండా కోవిడ్‌ విధులు

24 గంటలూ అందుబాటులోనే.. 

తోడైన సూపరింటెండెంట్, అడిష్నల్‌ సూపరింటెండెంట్ల గైడెన్స్‌

ఎప్పటికప్పుడు రోగులకు ఆదరణగా నిలుస్తూ భరోసా

హైదరాబాద్‌: సరిగ్గా 45 రోజుల నుంచి కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో నోడల్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ మల్లికార్జున్‌కు కంటిపై కనుకు లేదు. కోవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌ నుంచి సెకండ్‌ వేవ్‌ భయనాకమైన పరిస్థితుల్లో సైతం తనదైన శైలిలో విధులు నిర్వర్తిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. ఓ పక్క కోవిడ్‌ రోగుల తాకిడి మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ బెడ్స్‌ విషయంలో వచ్చే ఫోన్లకు వీసమెత్తు చికాకు చూపించకుండా తనకు ఉన్నతాధికారులు అప్పగించిన బాధ్యతను నూటికి నూరుశాతం చాలెంజ్‌గా తీసుకుని కోవిడ్‌ రోగుల పట్ల ఆదరణగా నిలిచారు డాక్టర్‌ మల్లికార్జున్‌. 

నిద్రలు లేని రాత్రులు 45... 
► ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు క రోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం సృష్టించింది. 

► ఈ నేపథ్యంలో ఆయా ఆస్పత్రుల్లోని నోడల్‌ అధికారుల పని, వారు స్పందించే తీరు రోగులకు ప్రధాన బలంగా నిలిచాయి. 

► ఇందులో భాగంగా ఇక్కడి నోడల్‌ అధికారి మల్లికార్జున్‌ సుమారు 45 రోజుల పాటు నిద్రలేని రాత్రులను గడిపారు. 

►బెడ్స్, కోవిడ్‌ సేవల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ప్రతిరోజూ 200కి పైగా ఫోన్స్‌ కాల్స్‌ వచ్చేవి. ఇవి కాకుండా వైద్యశాఖ నుంచి కోవిడ్‌ సేవలు, రోగుల రికవరీలు, మరణాల గురించి అప్‌డేట్స్‌ ఇవ్వడం, టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనడం జరిగేది. ఇలా నోడల్‌ అధికారిగా తనకిచ్చిన బాధ్యతను డాక్టర్‌ మల్లికార్జున్‌ వందకు వంద శాతం నిర్వర్తించారు.  

కోవిడ్‌ను ఎదుర్కొని మరీ.. 
► ఆస్పత్రి మొత్తం మీద 350 పడకలు ఎప్పుడు రోగులతో నిండి ఉన్నాయి. 

► ప్రతిరోజూ వీరందర్నీ డాక్టర్‌ మల్లికార్జున్‌ సందర్శించి, వారి సార్థక బాధలను విని వారికి ధైర్యం ఇచ్చేవారు. 

► ఆక్సిజన్‌ బెడ్‌ నుంచి వెంటిలేటర్‌.. వెంటిలేటర్‌ నుంచి ఐసీయూ వరకు ఎవరిని ఎప్పుడు షిప్ట్‌ చేయాలనే విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి రోగుల ప్రాణాలు కాపాడటంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. 

► రుచికరమైన భోజనం అందించే విషయంలో, రోగులు ఏ మేర ఆ ఆహారాన్ని తింటున్నారనే ప్రక్రియను సైతం ఆయన నేరుగా పరిశీలించే వారు. 

► ఇలా కొన్ని వేల మంది ప్రాణాలను రక్షించేందుకు తనకు అప్పగించిన నోడల్‌ అధికారి బాధ్యతను పటిష్టంగా చేపట్టారు.  

మరిన్ని వార్తలు