ముగిసిన జీహెచ్‌ఎంసీ నామినేషన్ల ప్రక్రియ

21 Nov, 2020 03:20 IST|Sakshi

చివరిరోజు బరిలో నిలిచిన 1,412 మంది అభ్యర్థులు

అత్యధికంగా గోషామహల్‌లో 36 నామినేషన్లు

అత్యల్పంగా టోలిచౌకిలో మూడు దాఖలు

సాక్షి, హైదరాబాద్ ‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. చివరిరోజు కావడంతో శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల గడువు ముగిసేసరికి గ్రేటర్‌లోని మొత్తం 150 వార్డులకు (డివిజన్లకు)గాను 1,932 మంది అభ్యర్థులు 2,602 నామినేషన్లు సమర్పించారు. వారిలో ఇండిపెండెంట్ల నుంచే 650 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 1,412 మంది 1,937 నామినేషన్లు దాఖలు చేశారు. పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలతో అట్టహాసంగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు.

మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోనేరు కోనప్ప, రాములు నాయక్, కాలేరు వెంకటేశ్, హరిప్రియానాయక్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా పార్టీల్లో టికెట్లు దక్కనివారు సైతం రెబెల్స్‌గా బరిలోకి దిగారు. మొత్తం వార్డుల్లో అత్యధికంగా గోషామహల్‌ నుంచి 36 నామినేషన్లు దాఖలవగా అత్యల్పంగా టోలిచౌకి నుంచి 3 నామినేషన్లు దాఖలయ్యాయి.

వార్డులు.. 150 
అభ్యర్థులు : 1,932
మొత్తం నామినేషన్లు : 2,602 

పార్టీల వారీగా దాఖలైన నామినేషన్లు
బీజేపీ : 571
టీఆర్‌ఎస్‌ : 557
కాంగ్రెస్‌ : 372
టీడీపీ :  206
ఎంఐఎం : 78
సీపీఐ / సీపీఎం : 22/21

మరిన్ని వార్తలు