నోముల ఆడియో దుమారం

3 Dec, 2020 05:49 IST|Sakshi

నకిరేకల్‌: దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణ వాంగ్మూలం పేరుతో ‘నన్ను ఎర్రజెండాతో సాగనంపండి’ అంటూ ఆయన వాయిస్‌తో వచ్చిన ఓ ఆడియో బుధవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద దుమారాన్ని లేపింది. అయితే చివరికి ఫేక్‌ అని తేలింది. నోముల నర్సింహయ్య రాజకీయ అరంగేట్రం చేసింది సీపీఎం నుంచే. ఆ పార్టీ తరఫున నకిరేకల్‌ నుంచి రెండు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి నాగార్జునసాగర్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం నుంచి మరణవాంగ్మూలం అంటూ ఆయన వాయిస్‌తో ఓ ఆడియో వాట్సాప్, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ ఆడియో వాస్తవమని కొందరు, ఫేక్‌ అని మరికొందరు చెప్పుకొచ్చారు. చివరికి కుటుంబ సభ్యులు దీనిపై స్పందించి ఫేక్‌ అని కొట్టిపారేశారు. ‘మా నాన్న వాయిస్‌తో మిమిక్రీ చేసి, ఆడియోను వైరల్‌ చేయడం మా కుటుంబానికి ఎంతో బాధ కలిగించింది’ అంటూ ఆయన కుమారుడు భగత్‌ ఖండించారు. ఆడియో వైరల్‌పై ఎస్పీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

అభిమానంతోనే ఆడియో చేశా..
ఇదిలా ఉండగా, తాను నర్సింహయ్యతో కలిసి పనిచేశానని, ఆయనపై అభిమానంతోనే ఈ ఆడియో చేసినట్లు కోదాడకు చెందిన ప్రజానాట్య మండలి కళాకారుడు కొండల్‌ ఓ వీడియోలో స్పష్టం చేశాడు. కానీ కొందరు దీనిని స్వార్థానికి వాడుకుని వైరల్‌ చేసి ఆ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేశారని చెప్పాడు. నర్సింహయ్య కుటుంబానికి వీడియోలో క్షమాపణ తెలిపాడు.  

నేడు నోముల అంత్యక్రియలు
హాజరుకానున్న సీఎం కేసీఆర్‌
నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెం గ్రామంలో జరగనున్నాయి. నోముల కుటుంబానికి చెందిన రెండు ఎకరాల స్థలంలో వారి తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానున్నారు. ఈ మేరకు అధికారులు, కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం హెలికాప్టర్‌లో నేరుగా పాలెంకు వచ్చే అవకాశం ఉండటంతో అందుకోసం హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్‌ కోసం స్థలం చదును చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఎస్పీ రంగనాథ్‌లు బుధవారం పరిశీలించారు. హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించి తగిన సూచనలు చేశారు.

నకిరేకల్‌ నుంచి పాలెంకు భౌతికకాయం
నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో భద్రపరిచిన నోముల నర్సింహయ్య భౌతికకాయాన్ని గురువారం ఉదయం 7.30 గంటలకు మొదట నకిరేకల్‌కు తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం 10.30 గంటల వరకు ఉంచుతారు. ఆ తర్వాత స్వగ్రామమైన పాలెం తీసుకెళ్తారు. కాగా, అమెరికాలో ఉన్న నోముల కుమార్తె బుధవారం రాత్రి 8 గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు