ఖమ్మంలో కడగండ్లు.. రంగారెడ్డిలో వడగళ్లు

16 Apr, 2021 02:21 IST|Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలను గురువారం అకాల వర్షం ముంచెత్తింది. తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్ల, పాల్వంచ, ఇల్లెందు, జూలూరుపాడు, బూర్గంపాడు మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చి రాశుల్లోకి నీళ్లు చేరి మిరపకాయలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పట్టాలు కప్పి ఉంచినప్పటికీ కింది నుంచి జలాలు చేరి తడిశాయి. వరిపంట నేలవాలింది. బూర్గంపా డు మార్కెట్‌ యార్డు, వైరా, తల్లాడ మండలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. నీటి ఉధృతికి రాశులు కొట్టుకుపోవడంతో రైతులు కాపాడుకునేందుకు అరిగోస పడ్డారు. కారేపల్లిలో ఈదురుగాలులకు వరిపంట నేలవాలగా, మామిడికాయలు రాలిపోయాయి. మధిర మండలం మల్లారంలో గొర్రెలను మేపుతున్న నర్సింహ యాదవ్‌ (45) పిడుగుపాటుకు గురై  మృతిచెందాడు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో..: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని యాచారం, చేవెళ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో వంద ఎకరాల్లోని వరిపంట నేలవాలింది. ఇంకా 50 ఎకరాల్లో మామిడితోటలు, మరో 50 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పరిగి మండలంలోని పలు గ్రామాల్లో 800కుపైగా ఎకరాల్లోని వివిధ పంటలు దెబ్బతిన్నాయి.
రెండో రోజూ తీరని నష్టం..
మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండోరోజూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రైతుల్ని బెంబేలెత్తించింది. నవాబుపేట మండలం కొల్లూర్‌లో ఈదురుగాలులకు రైస్‌మిల్లు పైకప్పు పూర్తిగా దెబ్బతిని బియ్యం, ధాన్యం తడిసిపోయాయి. గండేడ్‌లో ఇటుకబట్టీలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా నవాబుపేట మండలంలో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా మాగనూరు, మరికల్‌ మండలాల్లో వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. మరికల్‌లో దాదాపు 650 ఎకరాల్లో వరిపంటలు దెబ్బతిన్నాయి.  

మరిన్ని వార్తలు