Hyderabad: పనులు పూర్తి కాలేదు.. మరింత టైమ్‌ కావాలి!

16 Jun, 2022 07:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం(ఎస్‌ఎన్‌డీపీ) వింగ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, నిధులు మంజూరు అయినప్పటికీ పనులు కాలేదు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపునే మే నెలాఖరులోగా వీలైనన్ని పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ పనులు పూర్తవలేదు. ఇందుకు కారణాలనేకం.  ఈ సంవత్సరం ఆరంభం వరకు అసలు పనుల్లో కదలిక లేకుండాపోయింది. కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. ఒక్కో పనికి మూడు నాలుగుసార్లు టెండర్లు పిలవాల్సి వచ్చింది.

తీరా పనులు ప్రారంభమయ్యాక క్షేత్రస్థాయి పరిస్థితులతో అలైన్‌మెంట్లు, డిజైన్లు మార్చాల్సివచ్చింది. కొన్ని ప్రాంతాల్లో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలా చెబుతూపోతే.. ఎన్నో కారణాలున్నాయి. పనులు మాత్రం పూర్తి కాలేదు. వర్షాకాలం వచ్చి నేపథ్యంలో ఉన్నతాధికారులు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనుల వివరాల ఆధారంగా రాబోయే నెలన్నరలో దాదాపు పది పనులు పూర్తి చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు ఉన్నతాధికారులకు జోనల్‌ కమిషనర్లు, చీఫ్‌ ఇంజినీర్లు హామీ ఇచ్చారు. 

ఫాస్ట్‌ట్రాక్‌గా .. 
హామీ ఇచ్చిన పనుల్ని  ఫాస్ట్‌ట్రాక్‌గా, ఎక్స్‌ప్రెస్‌ వేగంతో పూర్తి చేయాలని భావిస్తున్నారు. కానీ.. వర్షాలు కురిస్తే ఇంజినీరింగ్‌ పనులు.. అందునా నాలాల వంటి పనులు చేయడం అసాధ్యం.  సమస్య పరిష్కారం కంటే ప్రమాదాలు కొనితెచ్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూలై నెలాఖరు వరకు  దాదాపు రూ.200 కోట్ల విలువైన  పనుల్ని పూర్తి చేయగలమని జోనల్‌ కమిషనర్లు హామీ ఇచ్చినా ఏమేరకు అమలవుతాయన్నది  వేచి చూడాల్సిందే. పనుల వేగం క్షేత్రస్థాయి స్థితిగతులు, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.  

జూలై ఆఖరు వరకు పూర్తవుతాయనుకుంటున్న పనుల వివరాలు..  

 పని పేరు.. అంచనా వ్యయం.. పూర్తయ్యే తేదీ..
► నాగిరెడ్డి చెరువు– కాప్రా చెరువు వరద కాల్వ పనులు. రూ.41 కోట్లు: (జూన్‌ 30) 
► ఫాక్స్‌సాగర్‌  కెమికల్‌ నాలా, కోల్‌కాల్వ– కెమికల్‌ నాలా. రూ.95 కోట్లు: (జూలై 15) 
► కరాచీ బేకరీ వద్ద పికెట్‌ నాలా ఆధునికీకరణ పనులు (ఒకవైపు).రూ.10 కోట్లు: (జూన్‌ 30) 
►  ఈర్ల చెరువు– నేషనల్‌ హైవే 65.రూ.15.58 కోట్లు: (జూలై 15) 
►  ఇసుకవాగు– నక్కవాగు.రూ.5 కోట్లు: (జూలై 15) 
►  మోదుకుల కుంట– కొత్తచెరువు. రూ.17.80కోట్లు: (15 జూలై) 
► అప్పాచెరువు– ముల్గుంద్‌ చెరువు. రూ.8.54 కోట్లు: (జూలై 31) 
► బాతుల చెరువు– ఇంజాపూర్‌ నాలా.రూ.9.65 కోట్లు: (జూన్‌ 30) 
► బండ్లగూడ చెరువు – నాగోల్‌ చెరువు. రూ.7.26 కోట్లు: ( జూలై 31) 
► నెక్నాంపూర్‌ నాలా– మూసీ. రూ.24 కోట్లు: (జూలై 31) 

ఫాక్స్‌సాగర్, కెమికల్‌ నాలా, కోల్‌కాల్వ–కెమికల్‌నాలా రెండు పనులు ఒకే ప్యాకేజీ  కింద చేపట్టారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌  04021111111కు ఫోన్‌ చేయవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్‌ 1912కు కూడా ప్రజలు ఫోన్‌ చేయవచ్చని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు