పడకేసిన పాలన!

11 Jan, 2024 08:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో పనులు పడకేశాయి. కోటి మందికి పైగా ప్రజలకు సేవలందించాల్సిన జీహెచ్‌ఎంసీలో సేవలందడం లేదు. చెత్త సమస్యల నుంచి రోడ్ల అవస్థల దాకా.. ప్రాపర్టీట్యాక్స్‌ ఫిర్యాదుల నుంచి  దోమల నివారణ  దాకా ప్రజా సమస్యల  పట్టింపు లేకుండాపోయింది. గత మూడు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల పేరిట పనులు కుంటుపడగా.. ప్రస్తుతం ‘ప్రజాపాలన’ పేరిట పనులు జరగడం లేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం జీహెచ్‌ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు అవస్థలు పడుతున్నారు. తమ సమస్యలు తీర్చే అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.  

► నవంబర్‌ నెలాఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అంతకు ముందునుంచే  ఎన్నికల నిబంధనల పేరిట పనులు కుంటుపడ్డాయి. పలువురు అధికారులు సైతం  ఎన్నికల విధుల్లోనే ఉండటంతో తమ విభాగాలకు సంబంధించిన పనులు పట్టించుకోలేదు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో తెలియదని పనుల జోలికి వెళ్లలేదు. ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలిశాక చేయాలనే తలంపుతో పనులు చేయడం లేరు.దానికి తోడు నిధుల లేమితోనూ శ్రద్ధ చూపడం లేదు.   

► ప్రాజెక్టులకు సంబంధించిన పనులను అలా వదిలివేయగా, ప్రజల నిత్య సమస్యలను సైతం పట్టించుకోవడం లేదు. ఎన్నికలు ముగిసేంత దాకా ఎన్నికల విధుల సాకుతో సమస్యలను వినిపించుకోలేదు.  ప్రస్తుతం ‘ప్రజాపాలన’ పేరిట మిగతా విషయాలను పట్టించుకోవడం లేదు. వివిధ విభాగాల అధికారులను, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి విభాగాధిపతుల దాకా ప్రజాపాలనలో భాగస్వాములను చేశారు. కార్యక్రమం పకడ్బందీగా, త్వరితగతిన నిర్వహించాలనే  తలంపుతో టీమ్‌లీడర్లు, స్పెషలాఫీసర్లు, తదితర పేర్లతో నియమించారు. దాంతో వారు తమ రెగ్యులర్‌ విధులు నిర్వహించడం లేదు. ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. వివిధ స్థాయిల్లోని అధికారుల మధ్య సమన్వయం  కోసమని స్పెషలాఫీసర్లను నియమించినా సమన్వయం కనిపించడం లేదు.  

ఎందరున్నా.. 
ఎందరిని నియమించినా తగిన పర్యవేక్షణ, సమన్వయం లేకే  ప్రజాపాలన దరఖాస్తుల్ని బజారు పాల్జేసి అభాసుపాలయ్యారు. అందుకు కారకులైన వారందరిపై చర్యలు తీసుకోలేకపోయారు. డిప్యూటీ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లనుంచి వివిధ విభాగాల అధికారులందరూ ‘ప్రజాపాలన’ విధుల్లోనే ఉన్నారంటున్నారు. సర్కిల్, జోనల్‌ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేరని కొందరు బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.ఆయా విభాగాల అధికారులతోపాటు కమిషనర్‌ సైతం ‘ప్రజాపాలన’ పనుల కోసం ఇతర జోన్లకు వెళ్లారనడంతో  నిస్సహాయంగా వెనుదిరిగారు.  

‘ప్రజావాణి’కి వెళ్లాల్సిందేనా.. 
ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం జరిగే  ‘ప్రజావాణి’కి హాజరు కావాల్సిందేనా ? అనే  ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుడ్డిలో మెల్ల చందంగా కనీసం సర్కిల్, జోనల్‌స్థాయిల్లో ‘ప్రజావాణి’ని ఇటీవలే ప్రారంభించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులనైనా వెంటనే పరిష్కరిస్తారో లేదో?! 

>
మరిన్ని వార్తలు