12 మంది టీచర్లకు షోకాజ్‌ నోటీసులు

3 Dec, 2020 08:25 IST|Sakshi

 ఆన్‌లైన్‌ తరగతులను  పర్యవేక్షించని ఉపాధ్యాయులు

డీఈఓ తనిఖీలతో సార్ల బాగోతం బట్టబయలు

ఆదిలాబాద్‌టౌన్‌: కోవిడ్‌ నేపథ్యంలో సర్కారు పాఠశాలలు తెరుచుకోలేదు. పేద విద్యార్థులు చదువు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా విద్యాబోధన కొనసాగిస్తోంది. ఆన్‌లైన్‌ తరగతులను పర్యవేక్షించాల్సిన గురువులు బాధ్యతలు విస్మరించి విధులకు ఎగనామం పెడుతున్నారు. పాఠశాలలకు ప్రతీరోజు యాభై శాతం మంది ఉపాధ్యాయులు హాజరుకావాలనే నిబంధన ఉంది. ఒకరోజు పాఠశాలకు, మరో రోజు హోమ్‌ టు వర్క్‌ చేపట్టాల్సి ఉంటుంది. అయితే చాలా మంది టీచర్లు విధులకు ఎగనామం పెట్టి సొంత పనులపైనే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డీఈవో ఎ.రవీందర్‌రెడ్డి పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయగా విధులకు ఎగనామం పెడుతున్న ఉపాధ్యాయుల బాగోతం బట్టబయలైంది. కాగా జిల్లా వ్యాప్తంగా విధులకు సక్రమంగా హాజరుకాని 12 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మరికొంత మంది ఉపాధ్యాయుల ఒకరోజు వేతనంలో కోత విధించారు. అయినా ఇంకొంత మంది ఉపాధ్యాయుల తీరులో మాత్రం మార్పు కానరావడం లేదు.

విధులకు ఎగనామం 
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించింది. కొన్ని సంస్థలు తెరుచుకోగా పాఠశాలలను మాత్రం ప్రారంభించలేదు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతుల వైపే మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ తరగతులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించారు. ఒకరోజు ఒక పాఠశాలలో సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరైతే మరో రోజు మిగతా సగం హాజరుకావాల్సి ఉంటుంది. పిల్లలు ఆ సమయంలో చదువుతున్నారా.. లేదా, పాఠం అర్థమయ్యిందా, పనులకు తీసుకెళితే తల్లిదండ్రులను ఒప్పించి చదివేలా ప్రోత్సహించడం, పాఠం అర్థం కాకపోతే వివరించడం, అలాగే పాఠశాలకు వెళ్లే రోజు పాఠ్యాంశాలకు సంబంధించిన డైరీ తయారు చేయడం, ఇంటివద్ద ఉన్నా రోజు ఫోన్‌చేసి విద్యార్థుల        చదువుకు సంబంధించిన సమాచారంపై వారి తల్లిదండ్రులతో చర్చించాలి. కాని ఇవేమి పట్టనట్లుగా కొంతమంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం పాఠశాల సమయం ముగిసే వరకు పాఠశాలలోనే ఉండాలి. అయితే వారికి నచ్చినప్పుడే పాఠశాలకు రావడం, హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్లిపోవడం, రెండు మూడు రోజులకోసారి పాఠశాలకు వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేసి ఇంటి బాటపడుతునట్లు ఆరోపణలు ఉన్నాయి.

జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్‌లైన్‌ తరగతుల పర్యవేక్షణను డీఈవో రవీందర్‌రెడ్డితోపాటు సెక్టోరియల్‌ అధికారులు ప్రతీరోజు పాఠశాలలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా తాంసి మండలంలోని కప్పర్ల జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఒకే ఒక ఉపాధ్యాయుడు హాజరయ్యారు. నలుగురు ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాల్సి ఉండగా, మిగతా వారు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో గైర్హాజరైన ఉపాధ్యాయులకు డీఈఓ మెమోలు జారీ చేశారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌ పట్టణంలోని రాంనగర్‌ జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలను తనిఖీ చేయగా ఓ ఉపాధ్యాయుడు హాజరు పట్టికలో సంతకం చేసి పాఠశాలలో లేకపోవడంతో ఆయన ఒకరోజు వేతనంలో కోత విధించారు. ఉట్నూర్‌ మండలంలోని జెడ్పీఎస్‌ఎస్‌ పెర్కగూడలో ఒకరికి, పీఎస్‌ పెర్కగూడలో ఒకటి, జెడ్పీఎస్‌ఎస్‌ శ్యామ్‌పూర్‌లో ఒకరికి, జెడ్పీఎస్‌ఎస్‌ సాలెవాడలో ఒకరికి మెమోలు జారీ చేశారు. ఇలా రోజూ డీఈఓ పర్యటిస్తుండడంతో విధులకు సక్రమంగా హాజరుకాని ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది.

ఎంఈఓల   పర్యవేక్షణ కరువు
ఆన్‌లైన్‌ తరగతులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తున్నారా.. లేదా అనే విషయాన్ని మండల విద్యాధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాని చాలా ఎంఈఓలు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. దీంతో కొంతమంది ఉపాధ్యాయులు వీరి అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని విధులకు డుమ్మా కొడుతున్నారు. ఎంఈఓలతో పాటు స్కూల్‌కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు పర్యవేక్షించాలి. వీరి పర్యవేక్షణ కూడా సక్రమంగా లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆడిందే ఆటగా కొనసాగుతోంది.

విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. ఆన్‌లైన్‌ తరగతులను పర్యవేక్షించాలి. ఆన్‌లైన్‌ బోధనలో విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి విద్యాబోధన గురించి ఆరా తీయాలి. ఆన్‌లైన్‌ విద్యకు విద్యార్థులు దూరం కాకుండా చూడాలి. 
– ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ   

మరిన్ని వార్తలు