13న శాసనసభ, 14న మండలి భేటీ

10 Oct, 2020 01:54 IST|Sakshi

2 రోజుల అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్‌ జారీ

చర్చించాల్సిన బిల్లులపై నేడు కేబినెట్‌ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఆరో సమావేశాల్లో భాగంగా రెండో విడత భేటీకి సంబంధించిన నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. శాసనసభ, మండలి ఒక్కో రోజు చొప్పున మాత్రమే సమావేశమయ్యే అవకాశముందని సమాచారం. శాసనసభ సమా వేశం ఈ నెల 13న 11.30 గంటలకు ప్రారంభ మవుతుంది. జీహెచ్‌ఎంసీ చట్ట సవరణతోపాటు మరికొన్ని బిల్లులపై చర్చించి శాసనసభ ఆమో దం తెలిపనుంది. శాసనసభలో ఆమోదించిన బిల్లులపై ఈ నెల 14న 11 గంటలకు ప్రారంభ మయ్యే శాసనమండలి చర్చిస్తుంది.

గత నెల 6 నుంచి 16 వరకు జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రోరోగ్‌ కాకపోవడంతో 13, 14 తేదీల్లో జరిగే భేటీని వర్షాకాల సమావేశాలకు పొడిగింపుగా భావించాల్సి ఉంటుంది. కాగా, సమావేశాల ఏర్పాట్లపై ఎలాంటి హడావుడి చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కోవిడ్‌ పరిస్థితుల్లో ఏర్పాట్లు, భద్రత, పాస్‌ల జారీ వంటి అంశాలపై ఆదివారంలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

నేడు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. మంగళ, బుధవారాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై కేబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. దీంతోపాటు యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటలసాగు విధానం, ధాన్యం కొనుగోలుపై చర్చించే అవకాశముంది.  

మరిన్ని వార్తలు