పేదలపై మరో గుదిబండ.. గోలి.. జేబు ఖాళీ! 

4 May, 2022 21:31 IST|Sakshi

ఔషధాల ధరలు పెంచుకునేందుకు ఎన్‌పీపీఎ అనుమతి 

10.7 శాతం పెరగనున్న అన్నిరకాల మందుల ధరలు 

జిల్లాలో ఆరువేలకుపైగా బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులు 

సగటున ఏడాదికి ఒక్కొక్కరిపై రూ.3,210 అదనపు భారం 

సామాన్యులు, మధ్య తరగతి వారిపై మరో పిడుగు పడనుంది. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వారు.. ఇకపై జ్వరం గోలికి సైతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వివిధ రకాల కారణాలతో ఔషధ కంపెనీలు 10.7 శాతం మేర ధరలు పెంచుకునేందుకు ఎన్‌పీపీఏ అనుమతిచ్చింది. గత నెల నుంచే కొన్నిరకాల మందుల ధరలు పెరగగా.. తాజాగా మిగతా వాటి పెంపునకు చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా మందు గోలీల రూపంలో పేదలపై మరో గుదిబండ పడనుంది. 

అయిజ రూరల్‌ (జోగులాంబ గద్వాల): నేషనల్‌ ఫార్మాసూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) తీసుకుంటున్న నిర్ణయంతో ఔషధ మందులు కొనుగోలు చేసేవారి జేబులు ఖాళీ కానున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే మార్కెట్లో ఉన్న మందుల ధరలకు అదనంగా మరో 10.7 శాతం పెరగనున్నాయి. గత నెలలోనే ఆయా కంపెనీలకు ధరలను పెంచుకునే అవకాశం కల్పించడం వల్ల ఇప్పటికే మార్కెట్లో లభించే కొన్ని మందుల ధరలు పెరిగాయి.

ఎన్‌పీపీఏ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో లభించే మందుల్లో దాదాపు 800 రకాల ధరలు పెగనున్నాయి. జ్వరం, గుండె వ్యాధులు, అధిక రక్తపోటు,  చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధులకు మందులు కొనాలంటే ఇక నుంచి కొనుగోలు దారుడికి భారంగా మారనుంది. సాధారణంగా వాడే మందుల్లో పారాషిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్‌ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లో క్యాసిన్‌ హైడ్రోక్లోరైడ్, మెట్రోనీడజోల్‌ లాంటి మందులు పెరుగుతున్న వాటి జాబితాలో ప్రధానంగా చెప్పుకోవచ్చు.  

సామాన్యులపైనే.. 
ఫార్మాసూటికల్‌ కంపెనీలు పెంచుతున్న ధరలు సామాన్యుడికి గుదిబండగా మారనున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో వివిధ రకాల వ్యాధుల బారిన పడినవారు కాకుండా, ప్రధానంగా బీపీ, షుగర్‌ వ్యాధులు ఉన్న వారు రూ.6 వేలకు పైచిలుకు ఉంటారని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కూడా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే అధికంగా ఉంటారని చెబుతున్నారు.

ఈ రెండు వ్యాధుల బారిన పడిన వారిలో దాదాపు 15 శాతం మంది మాత్రమే ప్రభుత్వం ద్వారా అందే మందులను వాడుతుండగా, మిగిలిన 85 శాతం వ్యాధిగ్రస్తులు ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి వాడుతున్నారు. ప్రైవేటు దుకాణాల్లో మందులు వాడుతున్న వారికి నెలకు రూ.2,500 వరకు ఖర్చు అవుతుంది. ఈ రూపేణా చూసుకున్న ఇప్పుడు పెరిగిన మందుల ధరల ప్రకారం వారికి ఏడాదికి రూ.3,210 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అసలే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరోవైపు పెరిగిన మందుల ధరలు గుదిబండగా మారనున్నాయి.  

పెరుగుదల ఎందుకు..? 
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ గణాంకాల ఆధారంగా 2020 సంవత్సరంతో పోలిస్తే 2021కి గాను మందుల టోకు ధరల సూచి ఇప్పటికే 10.7 శాతానికి పెరిగినట్లు ఎన్‌పీపీఏ ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు 2019లో మాత్రం ఔషధ కంపెనీలు మందుల ధరలను 2 శాతానికి పెంచుకోగా, అదే 2020 సంవత్సరంలో మాత్రం 0.5 శాతమే పెంచుకునే అవకాశం ఔషధ కంపెనీలకు కల్పించింది. కోవిడ్‌ అనంతరం మాత్రం మందుల తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం, ప్యాకింగ్, రవాణా ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఔషధ కంపెనీలకు ధరలు పెంచక తప్పడం లేదనే వాదనలు ఉన్నాయి. 

పేదలు ఎలా కొనాలి..  
మందులు ధరలు ఇలా పెరిగితే సామాన్యులు ఎలా కొనాలి. ఇప్పటికే  నిత్యావసర  వస్తువుల  ధరలు  అధికంగా పెరిగి పేదవాడు  అనేక  ఇబ్బందులు  పడుతున్నాడు.   ఇప్పుడు మందుల ధరలు పెరిగితే అదే పేదవాడు ఎలా కొని వ్యాధిని నయం చేసుకోవాలి. జ్వరం గోలి  కూడా       ధర  పెరుగుతుంది  అంటున్నారు. ఇలా అయితే చాలా కష్టం.                         
– ఆంజనేయులుగౌడ్, గట్టు

దశల వారీగా పెంపు..  
మందుల తయారికి ఉపయోగించే ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల ఔషధ మందుల ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని మందుల ధరలు నిబంధనల మేరకు పెరిగాయి. ఇంకా మరికొన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దశల వారీగా పెరుగుతాయి. 
– శ్రీకాంత్, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్, గద్వాల  

మరిన్ని వార్తలు