అసలు వీడు మనిషేనా?.. విదేశాల్లో భార్యను ఒంటరిగా వదిలేసి..

23 Feb, 2023 08:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అంటారు. కానీ, ఓ ప్రవాస ప్రబుద్ధుడు భార్య చదువు ఆర్థిక భారంగా భావించాడు. ఉన్నత చదువులు చదివి..మంచి ఉద్యోగం సంపాదించి భర్తకు చేదోడుగా నిలుద్దామనుకున్న ఆమె కలలను కల్లలు చేశాడు. విదేశాల్లో ఒంటరిగా వదిలేసి..తాపీగా చేతులు దులుపేసుకున్నాడు. అల్లుడికి నచ్చచెబుదామని పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో.. దిక్కుతోచని స్థితిలో బాధితురాలి తల్లిదండ్రులు గచ్చి»ౌలిలోని మహిళా పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా.. 

మాదాపూర్‌ జోన్‌కు చెందిన కావ్య (పేరు మార్చాం) స్థానికంగా డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు మ్యాట్రిమోని సైట్ల ద్వారా పెళ్లి సంబంధం వెతికి అమెరికాలో స్థిరపడిన కిషోర్‌ (పేరు మార్చాం)కు ఇచ్చి పెళ్లి చేశారు. 

కిషోర్‌ యూఎస్‌లోని వర్జీనియాలో ఉద్యోగి కావటంతో.. పెళ్లి తర్వాత ఈ యువ జంట అక్కడికి వెళ్లింది. కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేద్దామని భావించిన కావ్య అక్కడే ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌లో చేరింది. దీంతో భర్త అసలు రంగు బయటపడింది.  

భార్య చదువు ఆర్థిక భారంగా మారిందని కిషోర్‌ తనని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. దీనిపై ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు వివరించింది కావ్య. దీంతో పలుమార్లు ఫోన్‌లో అల్లుడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా పట్టించుకోలేదు. అల్లుడి తల్లిదండ్రులను కలిసి వారి కొడుక్కి సర్దిచెప్పమని చెబుదామని ప్రయత్నిస్తే వారి నుంచి కూడా స్పందన లేదు. దీంతో చేసేదిలేక గచ్చిబౌలిలోని మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు కిషోర్‌ తల్లిదండ్రులను విచారించగా.. వాళ్లిద్దరి మధ్య అవగాహన సరిగా లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. దీంతో విదేశంలో కూతురు ఒంటరైపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నారై సంబంధం ఇలా పెటాకులు కావటంతో అమ్మాయి చదువు, వసతి ఇతరత్రా ఖర్చులన్నీ తల్లిదండ్రులే భరిస్తున్నారు.  

ఎన్నారై బంధానికి ఏడు సూత్రాలు: 
► ఎన్నారైల ఎంపిక, పెళ్లి చేసే విషయంలో తొందరపడకూడదు. 
►  వరుడు/వధువు అతని కుటుంబ సభ్యుల నేపథ్యాన్ని ధ్రువీకరించుకోవాలి. 
► మ్యారేజ్‌ బ్రోకర్లు, బ్యూరోలపై ఆధారపడి సంబంధాన్ని అంగీకరించకూడదు. 
► ప్రవాసుల వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి. 
►  విదేశాలలో చట్టపరమైన హక్కులు, అర్హతలు, అత్యవసర సేవల గురించి తెలుసుకోవాలి. 
► వధువు వీసా, పాస్‌పోర్ట్, ఇతరత్రా ముఖ్యమైన కాపీలను వధువు కుటుంబం లేదా దగ్గరి స్నేహితుల వద్ద ఉంచాలి. 
►  ఎన్నారై వరుడి పాస్‌పోర్ట్, విదేశీయుల నమోదు కార్డు, సామాజిక భద్రత నంబరు, గత మూడు సంవత్సరాలకు సంబంధించిన పన్ను రిటర్న్‌లు, బ్యాంకు పత్రాలు వంటి కీలకమైన పత్రాలను తనిఖీ చేయాలి.   

మరిన్ని వార్తలు