NTR Jayanthi: ఎన్టీఆర్‌ శతజయంతి.. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు రాజకీయ ప్రముఖులు.. ఏడాదిపాటు ఉత్సవాలు: పురంధేశ్వరి

28 May, 2022 11:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, టాలీవుడ్‌ లెజెండరీ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా.. శనివారం ఎన్టీఆర్‌ఘాట్‌ వద్ద ప్రముఖుల సందడి నెలకొంది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్‌ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులు అర్పించి మాట్లాడారు. 

తెలుగు గడ్డ తరపున నందమూరి తారక రామారావు ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో  మే 28 -2022 నుంచి మే 28 -2023 వరకు ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీలో బాలకృష్ణతో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్‌ బొమ్మను వంద రూపాయల నాణెం పై ముద్రణ చేసే విధంగా అర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో భాగంగా.. నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కరిస్తాం అని పేర్కొన్నారామె.

ఆపై టీఆర్ఎస్ నాయకులు- మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నామా నాగేశ్వరరావులు నివాళులు అర్పించి.. భారతరత్న డిమాండ్‌ వినిపించారు. ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్‌. అయన అదేశాల మేరకు అభిమానులు పని చేస్తున్నారు. ప్రధాని మంత్రి కావాల్సిన అర్హతలున్న వ్యక్తి. కానీ, కాస్తలో అది జరగలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ వినిపించారు. 

శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మా అదృష్టం.  రాజకీయాల్లో, సినిమాలలో  ఆయనకు తారాస్థాయిలో అభిమానులు ఉన్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని నామ నాగేశ్వరావు అన్నారు.  భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్‌. మహా నాయకుడి స్ఫూర్తిని తీసుకోని సీఎం కెసీఆర్ నడుస్తున్నారు. దళిత బంధు అందులో భాగమే. నా వివాహానికి వచ్చారు.. నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని గుర్తు చేసుకున్నారు మోత్కుపల్లి నర్సింహులు.

మరిన్ని వార్తలు