సాధారణ పడకలకు మంగళం!

23 Sep, 2020 05:04 IST|Sakshi

రాష్ట్రంలోని కరోనా ఆసుపత్రుల్లో భారీగా తగ్గుతున్న వైనం

10 రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌లో 1,969 రెగ్యులర్‌ బెడ్లు కట్‌

సాధారణ రోగులు ఇళ్లలో చికిత్స పొందుతుండటమే కారణం

ఇప్పటివరకు 25.73 లక్షల టెస్ట్‌లు.. 1.74 లక్షల కేసులు

తాజాగా 2,166 కేసులు.. మరో 10 మంది మృతి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా చికిత్స చేసే సాధారణ పడకల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కేవలం ఆక్సిజన్, ఐసీయూ పడకలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించాయి. గతంలో కరోనా పాజిటివ్‌ వస్తే చాలు బాధితులు ఉరుకులు పరుగుల మీద ఆసుపత్రులకు వచ్చేవారు. వైరస్‌ తీవ్రత ఉన్నా లేకున్నా భయంతో చేరేవారు. లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ తేలితే ఆసుపత్రులకు వచ్చి సాధారణ పడకల్లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందేవారు. వారికి ఆసుపత్రులు సాధారణ వైద్యం చేసి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి పంపేవి. ఇప్పుడు పరిస్థితి మారింది.

సాధారణ లక్షణాలుంటే ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు వచ్చే సాధారణ రోగుల సంఖ్య తగ్గుతోంది. కేవలం ఆక్సిజన్‌ లేదా ఐసీయూ అవసరమైన రోగులు మాత్రమే ఆసుపత్రికి వస్తున్నట్లు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు కరోనా సాధారణ పడకలుగా ఉన్నవాటిలో కొన్నింటిని ఇతర వైద్య సేవల కోసం కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇది మంచి పరిణామమేనని, ప్రజల్లో కరోనాపై అవగాహన పెరగడం, తక్షణమే వైద్యం తీసుకోవడంతో ఆసుపత్రులకు రావాల్సిన అవసరం ఏర్పడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బెడ్ల కోసం వెతుకులాడే పరిస్థితి పోయిందని ఆయన చెబుతున్నారు.  

10 రోజుల్లో భారీగానే.. 
రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2,055 కరోనా రెగ్యులర్‌ (సాధారణ) పడకలున్నాయి. వాటిల్లో 821 పడకలు నిండిపోగా, 1,234 ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ నెల 21వ తేదీ నాటికి 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ పడకల సంఖ్య ఏకంగా 1,689కి పడిపోగా, వాటిల్లో సాధారణ రోగుల సంఖ్య కూడా 501కి పడిపోయింది. అంటే పది రోజుల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య పెరిగినా సాధారణ పడకలు 366 తగ్గాయి. అలాగే ఈ నెల 10న 199 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సాధారణ పడకల సంఖ్య 3,779 ఉండగా, వాటిల్లో 1,439 నిండిపోయాయి. ఇంకా 2,340 మిగిలిపోయాయి. తాజాగా 222 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 2,716 సాధారణ కరోనా పడకలుండగా, వాటిల్లో 995 నిండిపోయాయి. అంటే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా సాధారణ పడకల సంఖ్య ఈ పది రోజుల్లో ఏకంగా 1,603 తగ్గాయి.

మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సాధారణ కరోనా పడకలు 1,969 తగ్గాయి. అయితే ఆ మేరకు ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల సంఖ్య ప్రైవేట్‌లో పెద్దగా పెరగలేదు. ఎందుకంటే మొత్తం పడకల్లో సగానికిపైగా ఖాళీగా ఉంటున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్‌లో అన్ని రకాల పడకలు కలిపి 10,484 ఉండగా, వాటిల్లో 4,423 రోగులతో నిండిపోగా, ఇంకా 6,061 ఖాళీగా ఉన్నాయి. సాధారణ కరోనా వైద్యానికి బాధితులు ముందుకు రాకపోవడంతో జూబ్లీహిల్స్‌లో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో రెగ్యులర్‌ కరోనా పడకలను ఎత్తేశారు. అలాగే సికింద్రాబాద్‌లో ఉన్న మరో ప్రముఖ ఆసుపత్రిలోనూ సాధారణ పడకలను ఎత్తేసినట్లు మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. సూపర్‌ స్పెషాలిటీ స్థాయి ఆసుపత్రుల్లో చాలాచోట్ల కరోనా సాధారణ పడకలను ఎత్తేశాయి. వాటిని ఇతర వైద్య సేవలకు కొన్ని చోట్ల ఉపయోగిస్తుండగా, కొన్నిచోట్ల ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చుతున్నట్లు ఆయా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.  

2,166 కేసులు..
రాష్ట్రంలో సోమవారం నాటికి 25,73,005 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు మంగళవారం బులెటిన్‌లో తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,74,774కు చేరుకుంది. ఇక సోమవారం 53,690 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, 2,166 మందికి కరోనా సోకినట్లు తేలింది. అలాగే వైరస్‌ నుంచి 2,143 మంది కోలుకోగా, మొత్తం ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,44,073కి చేరింది. తాజాగా మరో 10 మంది మృతి చెందగా, ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,052కు చేరింది. ఇటు ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 29,649 ఉండగా, అందులో 22,620 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో 10 లక్షల జనాభాలో 69,304 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 309, రంగారెడ్డి జిల్లాలో 166, మేడ్చల్‌ జిల్లాలో 147, కరీంనగర్‌ జిల్లాలో 127, నల్లగొండ జిల్లాలో 113 నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు