వైరల్: కరోనా బాధితులతో డాన్స్‌ చేయించిన నర్సులు

13 May, 2021 12:48 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో రోజురోజు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో కరోనా సోకి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు డాక్టర్లు, నర్సులు మనోధైర్యాన్ని నింపుతున్నారు. అయితే అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నర్సులు కోవిడ్‌ బాధితుల్లో హుషారు నింపారు. ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపే పాటలు వేసి వారితో కలసి నృత్యాలు చేశారు. బాధితులు కూడా నర్సులతో మమేకం అయి స్టెప్పులు వేశారు. నిత్యం మంచంపైనే ఆందోళనకరంగా గడుపుతున్న తమకు నర్సులు ధైర్యం కలిగించారని బాధితులు సంతోషం వ్యక్తంచేశారు.

కోవిడ్‌ విధులు నిర్వర్తిస్తున్న భార్గవి, రాణి, కృష్ణవేణి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మానసిక ఆందోళనను తగ్గించి ధైర్యంగా సంతోషంగా ఉంచేందుకు ఇలా చేశామని నర్సులు చెబుతున్నారు. అయితే కరోనా పేషెంట్లతో నర్సులు డాన్స్ చేయించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నర్సులను శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. బాధితులను ఉల్లాసంగా ఉంచితే.. ప్రతి ఒక్కరు కరోనాను జయిస్తారని అంటున్నారు.

చదవండి: పిల్లలపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం

మరిన్ని వార్తలు