నిమ్స్‌లో నర్సుల మెరుపు సమ్మె.. యాజమాన్యం ఏం చెబుతోందంటే?

21 Mar, 2023 15:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిమ్స్‌ అసుపత్రిలో నర్సులు విధులు బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగారు. ఇంచార్జ్‌ డైరెక్టర్‌ అదనపు డ్యూటీలు వేస్తూ ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నర్సులు ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన చేపట్టారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి నిమ్స్‌లో వైద్య సేవలు నిలిచిపోయాయి. నర్సుల ఆందోళనతో   ఆపరేషన్‌లకు అంతరాయం ఏర్పడింది. 

నర్సుల ధర్నాపై యాజమాన్యం స్పందంచింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి నర్సులు స్ట్రైక్‌ చేయడం దురదృష్టకరమని కమిటీ మెంబర్‌ శ్రీ భూషణ్‌ తెలిపారు. ఎవరికీ చెప్పకుండా ఆందోళన చేస్తున్నారని, కనీసం కారణం కూడా చెప్పడం లేదన్నారు. ఉదయం నుంచి ఆసుపత్రిలోనే ఉన్నప్పటికీ తనతో మాట్లాడటానికి ఎవరూ రావడం లేదని తెలిపారు. హెచ్‌వోడీ, డైరెకర్టర్‌ను దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. 

‘నర్సుల ధర్నాతో ఆసుపత్రిలో సేవలు ఆగిపోయాయి. ఒకరికి ఇద్దరికీ ఉన్న సమస్య లను అందరికీ ఆపాదిస్తున్నారు. సమ్మె ఎందుకు చేస్తున్నారనే కారణం వారికి కూడా తెలియదు. పాత కారణాలు ఇప్పుడు చెప్తున్నారు. బాధ్యతయుతమైన హోదాలో ఉండి పద్దతి లేకుండా విధులు బహిష్కరణ చేశారు. నర్సుల ఆందోళనతో  ఆపరేషన్ థియేటర్స్ లో పిల్లలు ఆపరేషన్ కోసం ఫాస్టింగ్‌తో ఉన్నారు. ఇప్పుడు వారి తల్లదండ్రులకు ఏం చెప్పాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో 1400 మంది రోగులు ఉన్నారని, ఎంతో మంది పేషెంట్‌లకు వారి అవసరం ఉందని ఇంచార్జి డైరెక్టర్‌ బీరప్ప తెలిపారు. ఒక స్ట్రైక్‌ చేయాలంటే పద్దతి ఉంటుందని.. ఒకరిద్దరికీ మెమో ఇస్తే అందరూ సమ్మె చేయడం ఏంటని మండిపడ్డారు. తాను అందరికీ అందుబాటులో ఉన్నానని. రోజూ ప్రతి ఒక్కరినీ కలుస్తున్నానని తెలిపారు. తాను ఉన్నంత వరకు ఇక్కడ ఎటువంటి ఫేవరేటిజం ఉండదని స్పష్టం చేశారు. నర్సుల సమస్యల వినడానికి ఉదయం 9:30 నుంచి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

నిరసనలో కూర్చున్న చాలా మందికి  ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో కూడా తెలియదు.  ఇవాళ స్ట్రైక్ చేయాలి అని చెప్తే చేస్తున్నారు.  ముగ్గురుకి ఇచ్చిన మెమోల కారణంగా అందరినీ ఇలా చేయటం కరెక్ట్ కాదు.  ఒక నర్సు  ఏడాదిలో 143  రోజులు ఆలస్యంగా వచ్చారు. అది రిజిష్టర్‌లో రికార్డు కాలేదు. అందుకే మెమో ఇచ్చాం. మరో నర్సు 19 రోజులు రాలేదు. కానీ సీఎల్‌ లీవులు వాడలేదు. అందుకే మెమోలు ఇచ్చాం’ అని తెలిపారు.
 

మరిన్ని వార్తలు