నర్సులే బాస్‌లు

9 Oct, 2020 01:39 IST|Sakshi

 రాష్ట్రంలో 4,905  ఉప కేంద్రాల్లో నియమించాలని నిర్ణయం

వ్యాక్సిన్లు సహా ఆరోగ్య కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే 

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్య ఉప కేంద్రాలకు నర్సులనే బాస్‌లుగా నియమించాలని సర్కా ర్‌ నిర్ణయించింది. పల్లెవాసులకు వైద్యసేవలను మరింత చేరువ చేసేందుకు ఆరోగ్య ఉప కేంద్రాల బలోపేతంపై దృష్టిపెట్టింది. గురువారం వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలోనూ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 4,905 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వీటిలో ఏఎన్‌ఎంలే ప్రస్తుతం బాస్‌లుగా ఉన్నారు. ఆయా ఉపకేంద్రాల్లో టీకాలు ఇవ్వడం, గర్భిణులు, పిల్లలకు మందులి వ్వడం వంటివి నిర్వహిస్తున్నారు. వీటిలో ఇక నుంచి మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) అనే హోదాను ఏర్పాటు చేస్తారు.

దానికి నర్సులే బాస్‌లుగా ఉంటారు. టీకాలు, మందులు ఇవ్వడం వరకే పరిమితం కాకుండా షుగర్‌ టెస్టులు, బీపీ చెక్‌ చేయడం తదితర ఆరోగ్య సేవలు అందిస్తారు. ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమితులవ్వడానికి బీఎస్సీ నర్సింగ్‌ అర్హతగా నిర్ణయించారు. సబ్‌ సెంటర్లనే హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కిందిస్థాయిలో ఇవి పనిచేస్తాయి. రోగులను ఉప కేంద్రాల నుంచి వీటికి రిఫర్‌ చేస్తారు.  

ఔట్‌సోర్సింగ్‌లకూ అవకాశం 
ప్రభుత్వ వైద్యంలో ఇప్పటికే రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమితులైన నర్సులను ఉప కేంద్రాల్లో నియమిస్తారు. ఉప కేంద్రాల్లో పనిచేసే నర్సు లకు 6 నెలలు బ్రిడ్జి కోర్సులో శిక్షణనిస్తారు. శిక్షణ పూర్తయ్యా క నెలకు రూ.25 వేల చొప్పున వేతనం ఇస్తారు. పనితీరు ఆధారం గా నెలకు రూ.15 వేల వరకు పారితోషికం ఇస్తారు. ఎంపికైన వారిలో శాశ్వ త ఉద్యోగులుంటే ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా వారికి వేతనం ఉంటుంది. పారితోషికాన్ని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా ఇస్తా రు. ఎంపికైన ఎంఎల్‌హెచ్‌పీలు మూడేళ్ల పాటు ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేయాలి. ఆ మేరకు హామీపత్రం ఇవ్వాలి. వీరు ఉప కేంద్రం ఉన్నచోటే నివాసం ఉండాలి.

మరిన్ని వార్తలు