నకిలీల ‘అవుట్‌ సోర్సింగ్‌’

4 Mar, 2022 04:54 IST|Sakshi

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వైనం 

గిరిజన, ఏకలవ్య గురుకుల సొసైటీల్లో పెద్ద సంఖ్యలో అక్రమార్కులు 

బోగస్‌ సర్టిఫికెట్లతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వందకు పైగా ఉద్యోగాలు భర్తీ 

మిలాఖత్‌ అయిన అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ, సంబంధిత అధికారులు 

వరంగల్‌ జిల్లాలో ఉన్న ఓ ఏకలవ్య మోడల్‌ స్కూల్‌లో క్రాఫ్ట్‌ టీచర్‌గా ఒక అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి పదోతరగతి మాత్రమే చదవగా.. డిగ్రీ, అనుబంధ కోర్సులో ఉత్తీర్ణత సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. తర్వాత అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా క్రాఫ్ట్‌ టీచర్‌ ఉద్యోగం సంపాదించాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ, ఏకలవ్య మోడల్‌ పాఠశాలల్లోని పలు విభాగాల్లో పదుల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు పొందారు. 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లో తాత్కాలిక పద్ధతిలో నియమించే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకూ ‘నకిలీ’చీడ పట్టింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యా సంస్థలు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల్లో ‘నకిలీలు’ఉ న్నట్లు తెలుస్తోంది. వారికి అర్హత లేకున్నా ఇంటర్మీ డియట్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించి వాటి ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ కొలువులు సంపాదించుకున్నట్లు తెలిసింది. ఈ అంశం జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. 

బోగస్‌ సర్టిఫికెట్లతో బురిడీ.. 
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను జిల్లా స్థాయిలో ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఏజెన్సీల ద్వారా వచ్చే అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, ఆమోదం తెలిపిన అనంతరం వారిని ఉద్యోగంలో చేరనిస్తారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలవారీ జీతాలను ప్రభుత్వం నేరుగా కాకుండా ఏజెన్సీల ద్వారా చెల్లిస్తారు. ఈ క్రమంలో ఏజెన్సీల్లోని కొందరు నిర్వాహకులు ఒకరిద్దరు అధికారులతో మిలాఖత్‌ అయ్యి నకిలీ సర్టిఫికెట్లున్న అభ్యర్థులకు కొలువులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థలు, కాలేజీలతో పాటు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో పెద్ద సంఖ్యలో తప్పుడు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు వందకు పైగా ఉద్యోగులను ఇలా ఎంపిక చేసినట్లు వెల్లడైంది.

సబార్డినేట్‌ పోస్టులే ఎక్కువ.. 
గిరిజన గురుకుల సొసైటీతో పాటు ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అత్యధికం సబార్డినేట్‌ పోస్టులే ఉన్నట్లు సమాచారం. వాటితో పాటు కొన్నిచోట్ల బోధన సిబ్బందిని సైతం ఇలాగే భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ల్యాబ్‌ అసిస్టెంట్, అటెండర్‌ పోస్టులతో పాటు మెస్‌ మేనేజర్, క్రాఫ్ట్‌ టీచర్, ఆర్ట్‌ టీచర్, ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్‌ పోస్టుల్లో ఇలాంటి ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

సబార్డినేట్‌ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్లు నకిలీవి సృష్టించగా, బోధన సిబ్బంది కేటగిరీలో డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించారు. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలని ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అక్రమాల గుట్టు తెలుస్తుందని అంటున్నారు.  

మరిన్ని వార్తలు