బడి భూమిలో పాగా!

27 Jun, 2022 08:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని సైతం వదలడం లేదు అక్రమార్కులు. దర్జాగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఏకంగా పాఠశాల ప్రాంగణం వరుసగా రెండుసార్లు ఆక్రమణకు గురై  నిర్మాణాలు వెలుస్తున్నా... తాత్కాలిక అడ్డగింపు తప్ప శాశ్వత పరిష్కారానికి చొరవ కనిపించడం లేదు. నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల భూములు మాయమవుతున్నా ఇటు విద్యా శాఖ అధికారులు అటు రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారు.   

చెరలో శంకేశ్వర పాఠశాల ప్రాంగణం.. 

  • హైదరాబాద్‌ జిల్లాలో సుమారు 690 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 25 శాతం మినహా మిగిలిన పాఠశాలకు  సొంత స్థలాల్లో భవనాలు ఉన్నాయి. వాటికి ప్రాంగణాలు కూడా ఉన్నాయి. పాఠశాలలకు ఆనుకొని ఉన్న స్థల యజమానులు ప్రాంగణాలను ఆక్రమించుకోవడం, అడ్డుకుంటే  కోర్టుకు వెళ్లడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఇదే పరిస్థితిని తలపిస్తోంది సైదాబాద్‌లోని శంకేశ్వర బజార్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలకు  కేటాయించిన స్థలంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుతుండటంతో ఆటలకు అనువుగా ఉండేందుకు సుమారు 250 చదరపు గజాల స్థలాన్ని పాఠశాల ప్రాంగణంగా వదిలి మిగతా స్థలంలోని భవన సముదాయంలో పాఠశాల తరగతుల నిర్వహణ కొనసాగుతోంది. 
  • పదేళ్ల క్రితం పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలం యజమాని ప్రాంగణంలోని వంద గజాల స్థలాన్ని అక్రమించి తన ఇంటికి మార్గాన్ని సుగమం చేసుకున్నారు. అప్పట్లో విద్యా, రెవెన్యూ అధికారుల దృష్టికి కొందరు స్థానికులు ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనతోనే మిన్నకుండిపోయారు. దీంతో మిగిలిన 150 చదరపు గజాల స్ధలం రక్షించుకునేందుకు అప్పటి సైదాబాద్‌ కార్పొరేటర్‌ ప్రత్యేక చొరవ చూపించి పాఠశాల ప్రాంగణం రోడ్డు మార్గాన్ని మూసివేసి స్కూల్‌ ముందు మార్గంలో గేటు పెట్టించారు. 

మిగిలిన ప్రాంగణం కూడా 
మూడేళ్ల క్రితం పాఠశాల ప్రాంగణానికి  చెందిన మిగిలిన 150 చదరపు గజాల స్థలంపై కొందరి కన్ను పడింది. ఏకంగా ప్రాంగంణంలోని రెండు భారీ వృక్షాలను తొలగించి సామాజిక భవన్‌ పేరుతో నిర్మాణ పనులు చేపట్టారు.  దీంతో పాఠశాల ప్రాంగణం పూర్తిగా కనుమరుగైంది.  

క్షేత్రస్థాయి సందర్శనకే పరిమితం 
మూడేళ్లుగా పాఠశాల ప్రాంగణం ఆక్రమణ వ్యవహారంపై సంబంధిత అధికారుల క్షేత్ర స్థాయి సందర్శనకే పరిమితమైంది. శాశ్వత పరిష్కారం కోసం ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. జిల్లా విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ డివిజన్‌ అధికారి, తహసీల్దార్‌ తదితరులు పాఠశాలను సందర్శించడం, ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించడం తిరిగి వెళ్లిపోవడం సర్వసాధారణంగా మారింది.

తాజాగా కొందరు అధికారులు  ఆక్రమణదారులతో కుమ్మక్కై కింద పాఠశాల కోసం సెల్లార్, పైన సామాజిక వర్గం భవనం కొనసాగేలా సంధిమార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మన బస్తీ– మన బడి కార్యక్రమం కింద పాఠశాల ప్రాంగణం మార్గానికి  ప్రహరీ పనులు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై పాఠశాల ప్రాంగణం ఆక్రమణ వ్యవహారంపై హైదరాబాద్‌ డీఈఓను ఫోన్‌లో వివరణ కోరేందుకు సంప్రదించగా ఆమె నుంచి స్పందన రాలేదు.   

(చదవండి: పోలీస్‌ స్టేషన్‌లో రాచమర్యాదలు అందుకుంటున్న పిల్లి...ఎందుకో తెలుసా!)

మరిన్ని వార్తలు