Sirpur కేసులు బనాయిస్తాం జాగ్రత్త.. ‘సాక్షి’కి బెదిరింపులు

30 Sep, 2021 07:51 IST|Sakshi
అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమంగా తరలిస్తున్న కలప

‘సాక్షి’ విలేకరికి ఎఫ్‌ఎస్‌ఓ బెదిరింపులు

కలప అక్రమ రవాణాను వెలుగులోకి తీసుకురావడంతో హెచ్చరికలు

బెజ్జూర్‌ (సిర్పూర్‌): ‘కలప అక్రమ దందా నువ్వే చేపడుతున్నావు.. ఏం అనుకుంటున్నావు.. నువ్వు ఎక్కువ చేస్తున్నావ్‌.. నీపై కేసులు  బనాయిస్తాం..’ అంటూ బెజ్జూర్‌ అటవీ శాఖ ఎఫ్‌ఎస్‌వో ప్రసాద్‌ బుధవారం ‘సాక్షి’ బెజ్జూర్‌ విలేకరిని బెదిరింపులకు గురిచేశారు. ‘మాయమవుతున్న కలప’ శీర్షికతో రేంజ్‌ పరిధిలో కలప అక్రమ రవాణాపై ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. కలప అక్రమ రవాణాను అడ్డుకోలేని అధికారులు బుధవారం ఉదయం ‘సాక్షి’ విలేకరికి ఫోన్‌ చేసి భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారు. నిఘా పెంచి కలప అక్రమ రవా ణాను అడ్డుకుంటామని తెలపాల్సిన అధికారులు ఇలా భయబ్రాంతులకు గురిచేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌ కాల్‌పై ఎఫ్‌ఆర్వో దయాకర్‌ను వివరణ కోరగా ఈ విషయంపై విచారణ చేపడతామని వెల్లడించారు.

ప్లైయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు..
‘సాక్షి’ కథనంతో స్పందించిన అటవీ అధికారులు బుధవారం బెజ్జూర్‌ మండలంలోని మర్తిడి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన ఎస్‌కే మోహిత్‌ అనే వ్యక్తి ఇంట్లో ప్లైయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టి 25 టేకు కలప చెక్కలను పట్టుకున్నారు. ఈ మేరకు ప్లైయింగ్‌ స్క్వాడ్‌ ఎఫ్‌ఆర్వో అప్పలకొండ వెల్లడించారు. దీని విలువ రూ.8500లు ఉంటుందని వివరించారు. ఈ దాడుల్లో బెజ్జూర్‌ ఎఫ్‌ఆర్వో దయాకర్, ఎఫ్‌ఎస్‌వో ప్రసాద్, బీట్‌ అధికారి వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు.  

మరిన్ని వార్తలు