డేట్స్‌ ప్యాకెట్‌లో పురుగులు.. కుషాయిగూడ డీ మార్ట్‌లో ఘటన

24 Sep, 2022 16:00 IST|Sakshi
జరిమానా విధిస్తున్న ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ స్వప్నారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: డేట్స్‌ (కర్జూర) ప్యాకెట్‌లో పురుగులు రావడంతో అవాక్కైన వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టిన అధికారులు నిర్వాహకులకు జరిమాన విధించిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ డీ మార్ట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే..  న్యూ వాసవి శివనగర్‌ కాలనీకి చెందిన చంద్రశేఖర్‌ శుక్రవారం డీ మార్ట్‌లో డేట్స్‌ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. సరుకుల కొనుగోలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా అతడి కుమారుడు డీ మార్ట్‌ ఆవరణలోనే తినేందుకు డేట్స్‌ ప్యాకెట్‌ ఓపెన్‌ చేసి నోట్లో పెట్టుకోగా మూతిపై పురుగులు పారడాన్ని తండ్రి గమనించాడు.

వెంటనే అప్రమత్తమైన అతను ప్యాకెట్‌ను చూడగా కుళ్లిపోయి ఉంది. దీంతో అవాకైన చంద్రశేఖర్‌ డీ మార్ట్‌ సిబ్బందిని నిలదీయడమేగాక అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ స్వప్నారెడ్డి తన సిబ్బందితో కలిసి సరుకులను తనిఖీ చేశారు. పూర్తిగా కుల్లిపోయి, దుర్వాసన వెదజల్లుతున్న డేట్స్‌ ఫ్యాకెట్‌ను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో హెచ్చరికలు జారీ చేసినా తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఎంహెచ్‌ఓ డీ మార్ట్‌ నిర్వాహకులకు రూ.30 వేలు జరిమానా విధించారు.   
చదవండి: ఎంసెట్ స్టేట్‌ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు

మరిన్ని వార్తలు