అనాథాశ్రమాలపై నజర్‌

15 Aug, 2020 07:52 IST|Sakshi

అమీన్‌పూర్‌ ఘటన నేపథ్యంలో సీరియస్‌ 

ఎన్జీఓ, ప్రైవేట్‌ హోమ్స్‌పై ఆరా 

ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి 

పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు 

నిబంధనలు పాటించకపోతే సీజ్‌ 

నగరంలో అధ్వానంగా పరిస్థితి 

సాక్షి, సిటీబ్యూరో: అనాథ శరణాలయాలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేట్, ఎన్జీఓ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తోంది. నగర శివార్లలోని అమీన్‌పూర్‌లోని అనాథ శరణాలయంలో లైంగిక దాడికి గురై మృతి చెందిన 14 ఏళ్ల బాలిక ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు ఆశ్రమం రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడతో పాటు అక్కడి పిల్లలను సైతం ప్రభుత్వ హోమ్‌కు తరలించారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు మహిళాభివృద్ధి,   శిశు సంక్షేమ శాఖ ఉపక్రమించినట్లు సమాచారం. ప్రధానంగా నగరంలోని అనాథాశ్రమాల వివరాలు సేకరిస్తోంది.

ప్రభుత్వ అధీనంలో నిడిచే ఆశ్రమాలతో పాటు స్వచ్ఛంద సంస్ధలు, ప్రైవేట్‌ అధీనంలో కొనసాగుతున్న ఆశ్రమాల పరిస్థితిపై ఆరా తీసోంది. వాస్తవంగా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆశ్రమాలేన్ని? గుర్తింపులేనివి ఎన్ని? ఎంతమంది పిల్లలు ఉన్నారు? నిబంధనల పాటింపు, వసతులు, నిర్వహణ కోసం ఆర్థిక వనరులు, నిర్వాహకుల తీరు, వారి గతం, పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణకు కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం.  
 
పుట్టగొడుగుల్లా.. 
మహా నగరంలో ఆశ్రమాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎన్జీఓల ఆధ్వర్యంలో కొన్ని ఏర్పాటు కాగా, వ్యాపార దృక్పథంతో మరికొన్ని ఆశ్రమాలు కొనసాగుతున్నాయి. వీటిలో సగానికిపైగా అనుమతి లేకపోగా, మిగతా వాటిలో నిబంధనలు మచ్చుకు కూడా కనిపించని పరిస్థితి. వాస్తవంగా హైదరాబాద్‌– రంగారెడ్డి– మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆశ్రమాలు 10 శాతం మాత్రమే. వాస్తవంగా ప్రతి ఆశ్రమ నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆశ్రమాలను తనిఖీ చేసేందుకు రెవెన్యూ జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలున్నా.. ప్రభుత్వ అనుమతి తీసుకున్న ఆశ్రమాలపైనే కనీస పర్యవేక్షణ మాత్రం కరువైంది. ఇక గుర్తింపు లేని వాటిపై అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేకుండాపోయాయి.  

మారని తీరు.. 
నగరంలోని పలు ఆశ్రమాల్లో అనేక ఘటనలు వెలుగుచూస్తున్న వాటిపై చర్యలు తీసుకోవడంలో  సంబంధిత అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు హడావుడి సృష్టించి ఆ తర్వాత గాలికి వదిలేయడం షరామామూలుగా మారింది. తాజాగా  అమీన్‌పూర్‌ ఘటన దృష్ట్యా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణకు దిగినట్లు తెలుస్తోంది. ప్రతి ఆశ్రమంపై పర్యవేక్షణ కమిటీల తనిఖీలతో పాటు అంగన్‌వాడీలో కూడా పరిశీలనకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఆశ్రమాలపై పూర్తిస్థాయి వివరాల సేకరణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అనధికార హోమ్‌లతో పాటు నిబంధనలు పాటించని ఆశ్రమాలను సీజ్‌ చేసి కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు