ఆ మందుపాతర 20ఏళ్ల నాటిది

14 Dec, 2020 09:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దుమాలలో గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు

బయటపడ్డ గ్రెనేడ్లు పీపుల్స్‌వారివే: సీఐ సర్వర్‌  

ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): గాలింపు చర్యలకోసం వచ్చే పోలీసులను హతమార్చాలనే లక్ష్యంతో 20 ఏళ్ల క్రితం పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు గ్రెనేడ్ల రూపంలో అమర్చిన మందుపాతరను తాజాగా వెలికితీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో బయటపడ్డ గ్రెనేడ్లు పోలీసులను లక్ష్యం గా చేసుకునే అమర్చినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, మందుపాతరల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రెండోరోజు ఆదివారం జాగిలాల సహాయంతో బాంబు స్క్వాడ్‌ బృందాలు దుమాల పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. 20 ఏళ్ల క్రితం దుమాలను కేంద్రంగా చేసుకొని అప్పటి పీపుల్స్‌వార్, జనశక్తి నక్సలైట్లుతమ కార్యకలాపాలు కొనసాగించారు. పలుసార్లు ఇదే ప్రాంతంలో పోలీసుల నుంచి నక్సలైట్లు త్రుటిలో తప్పించుకున్న సంఘటనలున్నాయి. పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో నక్సలైట్లు చిట్టివాగు ప్రాంతంలో అమర్చిన గ్రెనేడ్‌లు 20 ఏళ్ల అనంతరం బయటపడినట్లు చెబుతున్నారు. దుమాల అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఎక్కడెక్కడ మందుపాతరలు అమర్చారన్న దానిపై జిల్లా బాంబు స్క్వాడ్‌ బృందాలు అన్వేషణ సాగిస్తున్నాయి. మందుపాతరలను వెలికి తీయడానికి మాజీ నక్సలైట్ల సాయాన్ని తీసుకుంటున్నారు.

నాడు రాగట్టపల్లిలో..
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్టపల్లిలో జనశక్తి నక్సలైట్లు గడ్డివాములో దాచి ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు కొద్దిరోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. గడ్డివాములో పేలుడు పదార్థాలు దాచి ఉంచినట్లు లొంగిపోయిన నక్సలైట్ల ద్వారా పోలీసులు  సమాచారం సేకరించారు. దుమాలలోనూ 20 ఏళ్ల క్రితం మందుపాతరల రూపంలో దాచి ఉంచిన గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకోవడం, ఈ రెండు సంఘటనలు పక్కపక్క గ్రామాల్లోనే చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దుమాలలో పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు అమర్చిన గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సర్వర్‌ స్పష్టం చేశారు. పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు మాత్రమే గ్రెనేడ్లను మందుపాతర్లుగా వాడతారని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు