ఆస్తి నవ్వింది.. అమ్మ ఏడ్చింది!

28 Aug, 2020 14:07 IST|Sakshi
అమరచింత పోలీస్‌స్టేషన్‌ ఎదుట దీనంగా కూర్చున్న వృద్ధ దంపతులు పుల్లారెడ్డి, గోవిందమ్మ

సాక్షి, అమరచింత(కొత్తకోట): ‘నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకులు.. వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టడానికి ఆస్తులు ఏమిచ్చారంటూ.. తమ పోషణను పట్టించుకోకుండా బయటికి వెళ్లండని గొడవపడుతున్నారు..’ అంటూ వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు పుల్లారెడ్డి, గోవిందమ్మ పోలీస్‌స్టేషన్‌ ఎదుట తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. మూడురోజుల క్రితం తమకు న్యాయం చేయాలంటూ తమ పోషణకు భరోసాను కల్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. గురువారం అదే పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. వివరాల్లోకి వెళితే.. వీరికి కుమారులు వెంకట్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డితో పాటు కూతురు అలివేలమ్మ ఉన్నారు.

తమకున్న పదెకరాల పొలంలో పెద్దకొడుకు వెంకట్‌రెడ్డి కూతుళ్ల వివాహ సందర్భాల్లో నాలుగెకరాలు అమ్మారు. భాగాల పంపిణీ సమయంలో కుమారులకు సమానంగా పంచి ఇచ్చారు. ప్రస్తుతం మూడు అంకణాల ఇళ్లు మాత్రమే తమ పేరిట ఉందని అది కూడా కాజేయాలనే కుట్రలు పన్నుతున్నారని వృద్ధ దంపతులు వాపోయారు. ఇద్దరు కొడుకులు సమానంగా తమను పోషిస్తామని పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారని, పెద్ద కొడుకు వెంకట్‌రెడ్డి ఇంటికెళ్తే చీదరించడంతో ఆ మాటలను భరించలేక చిన్నకొడుకు ఇంటికి వచ్చామన్నారు. హన్మంత్‌రెడ్డి కూడా అన్నకు ఇచ్చిన ఇంటిని తనపేర రాస్తే శాశ్వతకాలం పోషిస్తానని చెప్పడంతో పెద్ద కొడుకుకు ఇచ్చిన ఇంటిగోడను పడగొట్టే ప్రయత్నం చేశామని ఇందుకుగాను పోలీసులకు పెద్దకొడుకు వెంకట్‌రెడ్డి మాపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.  

ఉన్న పింఛన్లు కూడా పాయే!  
ప్రతినెలా వస్తున్న వృద్ధాప్య పింఛనుతో కాలం గడిపేవాళ్లమని పుల్లారెడ్డి, గోవిందమ్మ తెలిపారు. ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఉండరాదన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇద్దరిలో ఒకరి పెన్షన్‌ను తొలగించడానికి బదులుగా ఉన్న రెండూ తొలగించారన్నారు. ఐదు నెలలుగా చేతిలో డబ్బులు లేకపోవడంతో వ్యక్తిగత అవసరాలకు కొడుకులనైనా అడగలేక మదనపడుతున్నామన్నారు. అంతేగాక తమ పెద్ద కుమారుడు వెంకట్‌రెడ్డి కూతుళ్లు, అల్లుళ్లు కూడా తమను ఇంటి నుంచి గెంటివేస్తామని బెదిరిస్తున్నారని, తమ గోడును ఆలకించి తమకు న్యాయం చేయాలని దీనంగా వేడుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఏఎస్‌ఐ వెంకట్‌రాములును వివరణ కోరగా ఈ వ్యవహారంలో తండ్రి, కొడుకులే కూర్చుని మాట్లాడతారని గడువు కోరారని తెలిపారు.   

మరిన్ని వార్తలు