పాత సంప్రదాయం.. కొత్త ఆలోచనలతో.. ఐదు రోజుల పెళ్లిలో నిర్వహించే కార్యక్రమాలివే..

25 Dec, 2022 13:34 IST|Sakshi

ఒకప్పటి పద్ధతులు పాటిస్తూనే ఆధునిక హంగులతో వేడుక

ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో సందడి

అన్నీ సమకూరుస్తున్న ఈవెంట్‌ ఆర్గనైజర్లు

ఆనాటి పెళ్లిళ్లను గుర్తుచేస్తూ సెట్టింగ్‌లతో కొత్త కళ

ఖర్చు ఎక్కువైనా శ్రమలేకపోవడంతో ఆసక్తి చూపుతున్న ఔత్సాహికులు

ఈ నెలలో ఉమ్మడి జిల్లాలో వివిధ చోట్ల జరిగిన ఐదు రోజుల వివాహ వేడుకలు

రానున్న ముహూర్తాలలో ఈ తరహా పెళ్లిళ్లకు మరికొందరు సిద్ధం

(బి. జనార్దన్‌రెడ్డి)
పెళ్లంటే.. జీవితంలో ఒకసారి జరిగే మధుర ఘట్టం.. ఓ కొత్త జీవితానికి ఏడడుగులు శుభ తరుణం. పాతకాలంలో పెళ్లిళ్లు ఐదు రోజులపాటు జరిగేవి. వారం రోజుల ముందు నుంచే బంధువులతో పెళ్లి ఇళ్లు సందడిగా ఉండేవి. ఊరంతా హడావుడి కనిపించేది. రానురాను ఆ సందడి మాయమైంది. ఉదయం పెళ్లి జరిగితే సాయంత్రానికి ఆ సందడి ముగిసిపోతుంది. అతిథులు కూడా ఇలా వచ్చి కనిపించి వెళ్లిపోతున్నారు. అయితే, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఆచారాలకు మళ్లీ ఊపొచ్చింది. పాత సంప్రదాయాలను కొత్తతరం అందిపుచ్చుకుంటోంది. 

ఐదురోజుల పెళ్లిళ్లు మళ్లీ మొదలయ్యాయి. మెహందీ ఫంక్షన్‌తో మొదలు.. ఐదు రోజులపాటు పెళ్లి ఇల్లు కళకళలాడిపోతోంది. ఇది నిజంగా శుభపరిణామమే. పాశ్చాత్య సంస్కృతి అందరినీ ఆవహించేసి సంప్రదాయాలను దూరం చేస్తున్న వేళ నవతరం ఈ దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఒకప్పుడు పెళ్లంటే నెల, 15 రోజుల ముందే బంధువులు, ఆత్మీయులు వచ్చి తలోపని చేసేవారు. కానీ, ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అందుకు అవకాశం లేదు. అందుకనే, ఇలాంటి వెతలు తీర్చేందుకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు  వెలిశాయి.

సంప్రదాయాలను పాటించాలని ఆసక్తి ఉన్నవారికి ఈవెంట్‌ ఆర్గనైజ్‌ సంస్థలు అన్నీ సమకూర్చి పెళ్లికి నిండుదన్నాన్ని తీసుకువస్తున్నాయి. ఇప్పటి వరకు పెద్ద నగరాలకే పరిమితమైన ఈవెంట్‌ మేనేజ్‌మెంట్స్‌ చిన్న పట్టణాలకు కూడా విస్తరించాయి. సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఇళ్లలోనే జరిగే ఐదు రోజుల పెళ్లిళ్లపై ఇప్పుడు అప్పర్‌ మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఒక్కో కార్యక్రమం ఒక్కో రోజు నిర్వహిస్తున్నారు. ఈ తరహా పెళ్లిళ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్నిచోట్ల ఈ నెలలో జరిగాయి. పెళ్లి ముహూర్తాలు ఈ నెల 21తో ముగియగా.. జనవరి చివరి వారం నుంచి మళ్లీ మొదలవుతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకకు    కొందరు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకుంటున్నారు. 

ఈవెంట్స్‌ వారిది ప్రధాన పాత్ర
ఏ శుభకార్యమైనా ప్రజల ఆలోచనా విధానం.. అభిరుచికి తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేసి అతిథులతో ఆహా అనేలా చేస్తున్నాయి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు. పెళ్లిళ్ల కోసం ఎవరినీ సంప్రదించకుండా మొత్తంగా ఈవెంట్‌ మెనేజ్‌మెంట్‌దే బాధ్యతగా జనం ఒప్పందం చేసుకుంటున్నారు. బాజాభజంత్రీలు మొదలు.. వ«ధూవరులను ముస్తాబు చేయడం, పురోహితుడు, ఫంక్షన్‌హాల్‌ సహా కల్యాణం, రిసెప్షన్, వ్రతాలు ముగిసే వరకు వారే చూసుకుంటున్నారు. పెళ్లి పనులన్నీ సులువుగా అవుతుండడంతో ప్రజలు కూడా ఈవెంట్‌ సంస్థలపై ఆధారపడుతున్నారు. గతంలో పెళ్లి పనుల్లో వివిధ కుల వృత్తుల వారు భాగస్వామ్యం అయ్యేవారు. ఇప్పుడు అన్నీ పనులూ ఈవెంట్స్‌ మేనేజర్లే చూసుకుంటున్నారు. 

ప్రజల అభిరుచి మేరకు.. 
శుభకార్యాల నిర్వహణలో ప్రజల ఆలోచన విధానం మారుతోంది. స్టేటస్‌కు తగిన విధంగా వివాహాది శుభకార్యాలు చేయాలని భావిస్తున్నారు. అవసరమైన ఏర్పాట్లు, సామగ్రి అంతా ఒకేచోట దొరికేలా చూసుకుంటున్నారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లకు మంచి ఆదరణ ఉంటోంది.  వారి అభిరుచి మేరకు ఏమి కావాలో అడిగి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది చిన్నవి, పెద్దవి కలిపి 150 వరకు ప్రోగ్రామ్‌లు చేశాం.    – పద్మజ, ఈవెంట్‌ మేనేజర్, సూర్యాపేట

సంప్రదాయాలు కోరుకుంటున్నారు
తమ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయడానికి తల్లిదండ్రులు ఖర్చుకు వెనకాడడం లేదు. మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. పెళ్లికి కావాల్సిన వివిధ వస్తువులను కూడా సమకూరుస్తున్నాం. దీంతో పెళ్లి చేసేవారు ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఉంటున్నారు. పెళ్లిలో అన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. సంప్రదాయానికి కొంత కొత్తదనం జోడించి నిండుదనం తీసుకొస్తున్నాం.     – శ్రవణ్, కేపిఆర్‌ ఈవెంట్‌ మేనేజర్, నల్లగొండ 

ఈవెంట్‌ ఆర్గనైజ్‌ సంస్థల చార్జీలు ఇలా..
సంగీత్‌ : రూ.50 వేల నుంచి రూ.6 లక్షల వరకు 
మెహందీ : రూ.30 వేల నుంచి రూ.2 లక్షలు
హల్దీ : రూ.30 వేల నుంచి రూ.2 లక్షలు
కల్యాణం : రూ.లక్ష నుంచి రూ.15లక్షలు 
(ఫంక్షన్‌హాల్, భోజనం ఖర్చు కాకుండా)

వినియోగించే మ్యాన్‌పవర్‌
సంగీత్‌ : 5 నుంచి 30 మంది
మెహందీ : 10 మంది
హల్దీ – 10 మంది
వివాహం : 30 నుంచి వంద మంది 
(సప్లయర్స్‌ కాకుండా)

ప్రస్తుత ఐదు రోజుల పెళ్లిళ్లలో నిర్వహించే కార్యక్రమాలు ఇవీ..
సంగీత్‌: ఇది పెళ్లి కూతురు ఇంటి వద్ద జరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే అమ్మాయి బ్యాచ్‌లర్‌ పార్టీ. అమ్మాయి రేపటి నుంచి మరో కుటుంబంలోకి వెళ్లిపోతుంది కాబట్టి తన కుటుంబంతో ఒకరోజు ఆడిపాడుతుంది. రాజుల కాలంలో అయితే కచేరి నిర్వహించే వారు. ప్రస్తుతం అమ్మాయి కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు కలిసి నృత్యాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కొందరు వరుడి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానిస్తున్నారు. అంతా కలిసి పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

మెహందీ: గతంలో పెళ్లికూతురిని చేయడానికి ముందు ఇంట్లో వారే పెళ్లి కూతురికి చెట్టు నుంచి కోసి తెచ్చిన గోరింటాకు పెట్టేవారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇంట్లో ప్రత్యేక సెట్టింగ్‌ వేసి ఈవెంట్స్‌ వారితో పెళ్లి కూతురికి గోరింటాకు పెడుతున్నారు. ఈ కార్యక్రమం జరుగున్నంతసేపు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఒక రోజు మొత్తం నిర్వహిస్తున్నారు.

హల్దీ: పెళ్లి కూతురుకు పసుపు పెట్టడం. అమ్మాయి, అబ్బాయి ఇళ్లలోనూ మంగళస్నానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనికి కూడా భారీ సెట్టింగ్‌ పెడుతున్నారు.

వివాహం: పెళ్లిలో ప్రతిఒక్క ఘట్టం సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్నారు. వివాహ తంతులో సంప్రదాయంగా వాడే వస్తువులకు ప్రత్యేక డిజైన్లు వేస్తున్నారు. వరుడిని గుర్రంపై పెళ్లి మండం వరకు, ఆ తర్వాత ముత్యాల పందిరితో స్టేజీపైకి తోడ్కొనివస్తున్నారు. వధువును గంపలో కూర్చోబెట్టుకుని తీసుకువస్తున్నారు. సంప్రదాయంతో పాటు ఈవెంట్‌ ఆర్గనైజర్లు మరికొన్ని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

వ్రతం, రిసెప్షన్‌: చివరగా వ్రతంతో పెళ్లి వేడుక ముగుస్తుంది. వ్రతాలకు అవసరమయ్యే వస్తువులను కూడా ఈవెంట్స్‌ ఆర్గనైజర్లే సమకూరుస్తున్నారు. రిసెప్షన్‌ పెళ్లి కంటే ఎక్కువ ఆర్బాటంగా చేస్తున్నారు. 

మేళతాళాల్లోనూ స్పెషలే..
వివాహాలకు సన్నాయి బృందాలు, సాధారణ బ్యాండ్‌ వాయించడం ఇప్పటి వరకు ఉన్న ఆనవాయితీ. ప్రస్తుతం ఇందులోనూ కొత్త ట్రెండ్‌ వచ్చింది. కేరళ బ్యాండు, పంజాబీ బ్యాండ్‌కు బాగా క్రేజీ ఉంది. 

►పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో కొన్ని సామాజిక వర్గాల ఆచారాల ప్రకారం అదనపు కార్యక్రమాలు కూడా చేస్తారు. ప్రతి కార్యక్రమానికి ఒక డ్రెస్‌ కోడ్‌ పెడుతున్నారు. ఇంటిళ్లిపాదీ, బంధువులు ఈ కార్యక్రమాలకు ప్రత్యేక దుస్తులతో హాజరవుతున్నారు. 

ఎంతో సంతోషంగా ఉంది
మా పాప పెళ్లి వేడుక ఐదు రోజులు ఎంతో ఆనందంగా చేశాం. ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఈవెంట్‌ ఆర్గనైజ్‌ వారి సహకారంతో సంప్రదాయబద్ధంగా వేడుక పూర్తిచేశాం. దగ్గరి బంధువులు, మిత్రుల రాకతో ఒక రోజు ముందు నుంచే.. సందడి నెలకొంది. ఐదు రోజుల పెళ్లంటే కష్టమని అందరూ చెప్పారు. కానీ, పాత సంప్రదాయం మళ్లీ తీసుకురావాలనే కోరికతో కష్టమేమీ లేకుండా నిర్వహించాం. మాతో పాటు బంధువులంతా సంతోషం వ్యక్తం చేశారు. 
– మంగళగిరి రామ్మోహన్‌–రూపాదేవి, నల్లగొండ

కష్టమైనా.. ఇష్టంగానే చేశాం
ప్రస్తుత కాలంలో ఐదు రోజుల పెళ్లి చేయడం కొంచెం కష్టమే. గ్రామీణ ప్రాంతాలలో ఇబ్బంది ఉండదు. పట్టణాల్లో  బంధువులకు స్నేహితులకు వసతి కల్పించడం.. ఐదు రోజుల కార్యక్రమాలను ఇబ్బంది లేకుండా జరిపించడానికి కష్టపడాల్సి వచ్చింది. మా కూతురి పెళ్లి వేడుక ఐదు రోజులు జరిపించాం. ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు అన్ని రోజులు మాతో కలిసి ఉండడం ఆనందంగా ఉంది.
– దొంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి – ప్రమీల, కోదాడ

నాడు సంప్రదాయాలకే ప్రాధాన్యం
ఆ కాలంలో ఐదు రోజుల పెళ్లిళ్లు చేసేటప్పుడు సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇంటి పెద్దలు ముందుండి ఏ కార్యక్రమం ఎలా చేయాలో పద్ధతిగా చెప్పేవారు.. చేయించేవారు. బంధువులు ఇరుగుపొరుగువారు మమేకమై కార్యక్రమాలను ఆనందోత్సాహాలతో నిర్వహించేవారు. కాలం మారింది ఇప్పుడు ఐదు రోజుల పెళ్లిళ్లు భారీ సెట్టింగ్‌లు ఈవెంట్‌ మేనేజర్లతో కార్యక్రమాలు చేస్తున్నారు.     –శ్రీరామకవచం సరోజినీదేవి, కోదాడ 

మరిన్ని వార్తలు