మీకు దండం సారూ.. మీ వల్లే నేను ఇప్పుడు బతికున్నా..

28 Aug, 2023 14:53 IST|Sakshi

హైదరాబాద్: ఆర్పీరోడ్ లోని దర్గా ప్రాంతం..ఆదివారం ఉదయం..కొద్దిసేపట్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అక్కడ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం వస్తున్నారు. బందోబస్తులో భాగంగా మహంకాళి ఏసీపీ రవీందర్‌తో పాటు మిగతా పోలీసులు, నాయకులు అక్కడ ఉన్నారు. ఇంతలో ఓ మహిళ దూరం నుంచి పరుగెత్తుకుంటూ..అయాసపడుతూ వారి దగ్గరకు వచ్చింది. పోలీసులతో పాటు అందరూ ఏమైందా, అని కంగారు పడ్డారు.

కానీ వచ్చీ రావడంతోనే ఆ మహిళ ఏసీపీ రవీందర్‌ వద్దకు వెళ్లి ‘మీకు దండం సారూ..మీ వళ్లే నేను ఇప్పుడు బతికున్నా..మీరు చేసిన సహాయం మరచిపోలేను..అప్పుడు ఆపరేషన్‌ చేయించడం వల్లే ప్రాణాలతో ఉన్నా అంటూ ఆయాసపడుతూ చెప్పింది. వెంటనే అక్కడున్న వాళ్లు ఆమెను కొద్దిసేపు కూర్చోబెట్టి మంచి నీళ్లు తాగించి..ఏమైందంటూ ఆరాతీయగా...తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో ఉన్న ఆమెకు ప్రస్తుత మహంకాళి ఏసీపీ రవీందర్‌ సొంత డబ్బుతో ఆస్పత్రిలో చేరి్పంచి ఆపరేషన్‌ చేయించిన సంగతి చెప్పింది. 2014 సంవత్సరంలో టప్పాచబుత్రా పోలీస్‌ స్టేషన్‌లో రవీందర్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

రోడ్డు పక్కన కార్వాన్‌కు చెందిన కవిత అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో చేర్పించి సొంత ఖర్చులతో ఆపరేషన్‌ చేయించగా పూర్తి ఆరోగ్యంతో బయటపడింది. ఆ తర్వాత మళ్లీ ఆయన ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లడంతో కలవలేకపోయింది. ఆదివారం ఆమె కార్వాన్‌ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళుతుంది. బస్సులో నుంచి బందోబస్తు విధుల్లో ఉన్న ఏసీపీ రవీందర్‌ను చూసి..గుర్తించి బస్సు ఆపాలని డ్రైవర్‌ను కోరింది. కానీ డ్రైవర్‌ ఆపకుండా ప్యాట్నీ సిగ్నల్‌ వరకు వెళ్లాడు.

సిగ్నల్‌ దగ్గర బస్సు ఆగడంతో ఆమె బస్సు దిగి పరుగెత్తుకుంటూ దర్గా వరకు వచి్చంది. వచ్చీ రావడంతో ఆయనకు దండాలు పెడుతూ కన్నీరు పెట్టింది. మీ వల్లే ఈ రోజు ప్రాణాలతో ఉన్నా సారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీరు కలుస్తారో లేదో అనుకుంటూ పరుగెత్తుకొచ్చాను అంటూ చెప్పుకొచి్చంది. మీరు ఇంకా పెద్ద పోస్టులోకి రావాలి, ఎమ్మెల్యే అంత ఎదగాలి సారూ అంటూ కృతజ్ఞతాభావాన్ని చాటింది.

‘నా అన్న కోసం వెండి రాఖీ కొని తీసుకుని వచ్చి కడతా’ అంటూ చెప్పింది. అంతే కాకుండా తన ఫోన్‌లో భద్రపరుచుకున్న ఏసీపీ ఫొటోను చూపించి ఆశ్చర్య పరిచింది. ఈ సంఘటన చూసిన పోలీసులు, మీడియా ప్రతినిధులు, నాయకులు అందరూ ఆ మహిళ కృతజ్ఞతాభావాన్ని, ఏసీపీ మానవతా దృక్పథాన్ని అభినందించారు. 

మరిన్ని వార్తలు