Suryapet: పింఛన్‌ కోసం వెళ్తే చనిపోయావన్నారు

27 Aug, 2022 14:43 IST|Sakshi
వెంకటనర్సమ్మ చనిపోయినట్లుగా ఆన్‌లైన్‌లో వచ్చిన పత్రం    

సాక్షి, హైదరాబాద్‌: పింఛన్‌ కోసం అధికారులను ఆశ్రయించిన వృద్ధురాలికి వింత అనుభవం ఎదురైంది. పింఛన్‌ మంజూరైందో, లేదో తెలుసుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్తే ఆన్‌లైన్‌లో ఆమె చనిపోయినట్లుగా ఉందన్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం జరిగింది. చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామానికి చెందిన బుడిగె వెంకటనర్సమ్మ వృద్ధాప్య పింఛన్‌ కోసం ఏడాదిక్రితం దరఖాస్తు చేసింది.

ప్రభుత్వం ఇటీవల కొత్త పింఛన్లు మంజూరు చేయడంతో ఆ జాబితాలో తన పేరు ఉందో లేదో తెలు సుకునేందుకు కుమారుడు నరేష్‌తో కలిసి వెంకటనర్సమ్మ శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది. వెంకటనర్సమ్మ ఆధార్‌ కార్డు నంబర్‌ను కార్యదర్శి సౌమ్య ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేయగా ఆమె చనిపోయినట్లుగా చూపించింది.

అనంతరం మీసేవ, మండల పరిషత్‌ కార్యాలయాల్లో విచారిస్తే.. అక్కడెక్కడా ఆ ధ్రువీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆన్‌లైన్‌లో మాత్రం మరణించినట్లుగా నమోదై ఉండడంతో వెంకటనర్సమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాను బతికే ఉన్నానని, పింఛన్‌ మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటోంది. 
చదవండి: Munugodu Politics: మునుగోడు బరిలోకి వైఎస్సార్‌టీపీ! 

>
మరిన్ని వార్తలు