ఒమన్‌లో వలస కార్మికులకు క్షమాభిక్ష

29 Nov, 2020 13:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి స్వదేశం వెళ్లేందుకు అవకాశం 

డిసెంబర్‌ 31 వరకు దరఖాస్తులకు గడువు 

సాక్షి, జగిత్యాల: ఉపాధి కోసం వచ్చి సరైన పత్రాలు లేక చట్టవిరుద్ధంగా తమ దేశంలో ఉంటున్న వలస కార్మికులకు ఒమన్‌ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాదిమంది కార్మికులకు ఊరట లభించనుంది. వీసా గడువు ముగిసిన కార్మికులు తమ స్వదేశానికి వెళ్లేందుకు డిసెంబర్‌ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఒమన్‌ ప్రభుత్వం ప్రకటించింది. వీసా గడువు ముగిసి, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారంతా అక్కడి ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించి, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కానీ లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారితో తమ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఒమన్‌ ప్రభు త్వం భావిస్తోంది. దీంతో అలాంటి వారందరికి క్షమాభిక్ష ద్వారా తమ స్వదేశాలకు వెళ్లేలా వెసులుబాటు కల్పించింది.  

25 లక్షల మంది వలసదారులు 
ఒమన్‌ దేశంలో భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంకతోపాటు పలు ఇతర దేశాలకు చెందిన సుమారు 25 లక్షల మంది వలస కార్మికులు ఉపాధి పొందుతున్నారు. క్షమాభిక్ష ద్వారా చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని స్వదేశాలకు పంపిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, స్వస్థలాలకు తిరిగి వచ్చే వలస కార్మికులకు సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నోడల్‌ ఆఫీసర్‌ను ప్రత్యేకంగా నియమించాలని, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు అందించి అవుట్‌ పాస్‌పోర్టు జారీ చేయాలని భారత కార్మికులు కోరుతున్నారు. ఉచిత విమాన సదుపాయం కల్పించి కార్మికులను ఆదుకోవాలని ఒమన్‌–తెలంగాణ ఫ్రెండ్స్‌ సంస్థ సభ్యుడు నరేంద్ర పన్నీర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు