Omicron In Hyderabad: హైదరాబాద్‌లో ఒమిక్రాన్‌ కలవరం.. వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిక

4 Dec, 2021 06:48 IST|Sakshi

కొత్త వేరియంట్‌ నేపథ్యంలో సిటీలో కలవరం 

తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌  

గత వారం రోజుల్లో గ్రేటర్‌లో 682 కేసులు నమోదు 

విద్యాసంస్థలు, మార్కెట్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలపై నజర్‌

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్లుగా సిటిజన్ల కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా (డెల్టా వేరియంట్‌) వైరస్‌....తాజాగా ‘ఒమిక్రాన్‌’ రూపంలో నగరవాసులను మళ్లీ కలవర పెడుతోంది. ఇప్పటికే యూకే సహా సింగపూర్, కెనడా, అమెరికా వంటి దేశాల నుంచి వచ్చిన 13 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడం,  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం గ్రేటర్‌ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య మాత్రమే తగ్గిందని, వైరస్‌ తీవ్రత ఇంకా అలాగే కొనసాగుతోందని ప్రభుత్వం సహా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  

సభలు, సమావేశాలు, పుట్టిన రోజు, పెళ్లిరోజు వేడుకల పేరుతోపెద్ద సంఖ్యలో జనం గుమిగూడుతున్నారు. మార్కెట్లు, సినిమా హాళ్లు, వినోదాలు, విహార యాత్రల పేరుతో ఇష్టారీతిగా తిరుగుతున్నారు. మధ్య వయస్కులు, యువతీ, యువకుల నిర్లక్ష్యానికి రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 ఏళ్లలోపు వారికి ఇప్పటి వరకు టీకాలు రాకపోవడంతో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు వెనుకాడుతుండటంతో ప్రత్యక్ష హాజరు శాతం తగ్గిపోతోంది.   

చదవండి: (Omicron: హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు) 
   
స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే లోపే... 
ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్‌ మాసాల్లో భారీగా కోవిడ్‌ కేసులు నమోదైనప్పటికీ..ఆ తర్వాతి నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ప్రజల ఆర్థిక ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిని సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం దశల వారీగా కోవిడ్‌ ఆంక్షలను ఎత్తేసింది. సెప్టెంబర్‌ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పునః ప్రారంభం కావడం...మార్కెట్లు సహా వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం..ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ను ఎత్తేవేయడంతో. సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు సిటిజన్లు భావించారు. ఇక కోవిడ్‌ పీడ విరగడైందని భావించి మాస్క్‌లను పక్కన పడేశారు. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే లోపే...ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో మళ్లీ ఆందోళన మొదలైంది. ప్రభుత్వం అప్రమత్తమై విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తోంది. వైరస్‌ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి పంపుతోంది. 14 రోజుల పాటు హోం కార్వంటైన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తోంది. 

ప్రధానోపాధ్యాయురాలికి కోవిడ్‌ 
కంటోన్మెంట్‌: తిరుమలగిరి మండలం మడ్‌ఫోర్ట్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐరిన్‌ సుప్రదకు కరోనా సోకింది. ఈ మేరకు ర్యాపిడ్‌ టెస్టులో ఈ విషయం తేలడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయి ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుకు శాంపిళ్లు పంపించారు. ఇదిలా ఉండగా ఇదే పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలి కుమారుడికి ఇటీవల కరోనా సోకగా, 15 రోజుల పాటు సెలవు తీసుకుంది. సదరు ఉపాధ్యాయురాలికి సైతం కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్నాక, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి గురువారమే పాఠశాలలో చేరింది. శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు కరోనా బారిన పడటం గమనార్హం.  

చదవండి: (Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌ బయటపడింది ఇలా..!)

విద్యాసంస్థలపై దృష్టి  
విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, గురు కులాలను హాట్‌స్పాట్‌ల జాబితాలో చేర్చి ఆమేరకు నియంత్రణ చర్యలు చేపట్టింది. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తోంది. విద్యార్థులంతా మాస్క్‌లు ధరించేలా..ప్రతి పీరియడ్‌ తర్వాత విధిగా శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకునేలా..జాగ్రత్తలు సూచిస్తోంది. నిన్న మొన్నటి వరకు బెంచికి నలుగురైదుగురు విద్యార్థులు కూర్చోగా..ప్రస్తుతం ఇద్దరు,ముగ్గురికే పరిమితం చేసింది. పాఠశాలలను ఉదయం, సాయంత్రం శానిటైజ్‌ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఆయా యాజమాన్యాలు ఇప్పటికే ఆయా పనుల్లో నిమగ్నమయ్యాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.  

అన్ని ఏర్పాట్లు చేశాం 
కోవిడ్‌ పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. జిల్లాల నుంచి వచ్చిన కోవిడ్‌ పేషెంట్లకు గాంధీలోనే సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం 150 మంది చికిత్స పొందుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు సమకూర్చాం. వైరస్‌ తీవ్రతను బట్టి అవసరమైతే అదనపు పడకలు సమకూరుస్తాం. ప్రజలు గతంలో మాదిరిగా కోవిడ్‌ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. లేకుంటే మూల్యం చెల్లించక తప్పదు.         
– డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి 

మరిన్ని వార్తలు