తెలంగాణలో ఒమిక్రాన్ టెన్ష‌న్‌: విదేశాల నుంచి వచ్చిన 13 మందికి..

7 Dec, 2021 13:25 IST|Sakshi

విదేశాల నుంచి వచ్చిన 13 మందికి సాధారణ కరోనానే... 

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఫలితాలను వెల్లడించిన మంత్రి హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌ వచ్చినా, అది ఒమిక్రాన్‌ వేరియంట్‌ కాదని తేలడంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది. హైరిస్క్‌ దేశాల నుంచి వచ్చినవారిలో 13 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారందర్నీ చికిత్స కోసం టిమ్స్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తెలంగాణకు రిస్క్‌దేశాల నుంచి 1,805 మంది ప్రయాణికులు వచ్చారు.

వారిలో 13 మందికి సాధారణ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అందరి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా, ఎవరికీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ సోలేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు సోమవారంరాత్రి వారు ప్రత్యేక బులిటెన్‌ విడుదల చేశారు. సోమవారం ఆయా దేశాల నుంచి 535 మంది ప్రయాణికులు రాగా, అందరికీ కరోనా నెగెటివ్‌ అని తేలిందన్నారు. 

రాష్ట్రంలో కొత్తగా 195 కేసులు.. 
రాష్ట్రంలో సోమవారం ఒక్క రోజులో 37,108 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 195 మందికి పాజిటివ్‌ వచ్చిందని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6.77 లక్షలకు చేరుకుందన్నారు. తాజాగా ఒకరు చనిపోగా, మొత్తం కరోనాతో మరణించినవారి సంఖ్య 4 వేలకు చేరుకుందని వెల్లడించారు. ఒక రోజులో 171 మంది కోలుకోగా, మొత్తం 6.69 లక్షల మంది రికవరీ అయ్యారు.

కాగా, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకుందని ఆయన తెలిపారు. ఒక్క రోజులో 4.30 లక్షల మంది వ్యాక్సిన్లు తీసుకున్నారని, రెండో డోస్‌ తీసుకోవాల్సినవారు ఇంకా 23.96 లక్షల మంది ఉన్నారన్నారు. ప్రస్తుతం 65.09 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రసుత్తం కరోనాతో 1,261 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.  

చదవండి: గోవాలో ఎంజాయ్‌ చేస్తున్న ఖమ్మం ఎమ్మెల్సీ ఓటర్లు, వీడియో వైరల్‌

>
మరిన్ని వార్తలు