పోలీసు ఉద్యోగాలకు.. లక్ష మంది మహిళల దరఖాస్తు 

14 May, 2022 02:07 IST|Sakshi

ఇప్పటివరకు మొత్తం 4.5 లక్షల దరఖాస్తులు 

రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ శ్రీనివాసరావు 

సాక్షి, హైదరాబాద్‌: పోలీసుశాఖతో పాటు ఫైర్, జైళ్లు, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఎస్పీఎస్‌ ఉద్యోగాలకు శుక్రవారం సాయంత్రం వరకు 4.5 లక్షల దరఖాçస్తులు వచ్చినట్లు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 4.5 లక్షల దరఖాస్తుల్లో 2.5 లక్షల మంది వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇందులో 23 శాతం అంటే ఒక లక్ష మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పురుషులు 77 శాతం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 6 శాతం ఓపెన్‌ కేటగిరీ, 53 శాతం బీసీ, 22 శాతం ఎస్సీ, 19 శాతం ఎస్టీ అభ్యర్థులున్నట్లు ఆయన వివరించారు. అభ్యర్థులు మూడు వంతుల్లో దాదాపు రెండు వంతుల మంది పరీక్ష మాధ్యమం తెలుగు మీడియం ఎంచుకున్నారని, ఒక వంతు ఇంగ్లిష్‌ మీడియం, 0.2 శాతం ఉర్దూ మాధ్యమం ఎంచుకున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.

పోలీసు ఉద్యోగాల దరఖాస్తులకు మరో వారం మాత్రమే సమయం ఉన్నందున అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి ఉండకుండా త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చివరి నిమిషంలో అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేయడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చే ప్రమాదముందని అప్రమత్తం చేశారు. కాగా, ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 20 రాత్రి 10 గంటల వరకు సమయం ఉన్న సంగతి తెలిసిందే.   

మరిన్ని వార్తలు