కరోనా రోగుల్లో మూడోవంతు ఆసుపత్రుల్లోనే..!

15 Apr, 2021 03:09 IST|Sakshi

8,567 మందికి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స 

2,292 మంది ఐసీయూలో... 4,233 మంది ఆక్సిజన్‌పై 

ఇళ్లు, కోవిడ్‌కేర్‌ ఐసోలేషన్‌లో 66.34 శాతం మంది

పెరుగుతున్న కేసులు... తగ్గుతున్న రికవరీలు  

నెలన్నరలో 98.80% నుంచి 91.86%కు తగ్గిన రికవరీ 

3 వేల ఆసుపత్రుల్లో చికిత్సలకు ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగుల్లో మూడో వంతు మంది ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. నిత్యం ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నెలన్నర క్రితం ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారు వెయ్యి మంది వరకు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిది రెట్లు పెరగడం గమనార్హం. మరోవైపు రికవరీ అవుతున్న వారి శాతం కూడా పడిపోతోంది. నెలన్నర కిందటితో పోలిస్తే, రికవరీ 6.94 శాతం తగ్గింది. నెలన్నర కిందట కేసుల సంఖ్య ఒక రోజుకు 178 ఉంటే, ఇప్పుడు మూడు వేలు దాటిపోయాయి. సెకండ్‌ వేవ్‌ ఈ కొద్దికాలంలోనే తీవ్రరూపం దాల్చింది. మున్ముందు అది మరింత ఉగ్రరూపం దాల్చుతుందని వైద్య ఆరోగ్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.  

ఆసుపత్రుల్లో 8,567... ఐసోలేషన్‌లో 16,892 
నెలన్నరలో కేసుల సంఖ్య, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి 26వ తేదీన 178 కేసులు నమోదు కాగా, ఇటీవల మూడు వేలు దాటిపోయాయి. ఉగాది పండుగ రోజు కావడంతో పరీక్షలు తక్కువ చేయడం వల్ల మంగళవారం 2,157 కేసులు నమోదయ్యాయి. ఇక నెలన్నర క్రితం యాక్టివ్‌ కేసులు 1,939 ఉండగా, అందులో 850 మంది ఐసోలేషన్‌లో ఉంటే మిగిలిన 1,089 మంది ఆసుపత్రుల్లో చేరారు. అయితే తాజాగా మంగళవారం నాటి లెక్క ప్రకారం కరోనా యాక్టివ్‌ కేసులు ఏకంగా 25,459కు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. అందులో 16,892 మంది (66.34%) ఐసోలేషన్‌లో ఉండగా, ఆసుపత్రుల్లో 8,567 మంది (33.66%) ఉన్నారు. ఇక ఆసుపత్రుల్లో ఉన్నవారిలో 2,292 మంది ఐసీయూ లేదా వెంటిలేటర్‌పై, 4,233 మంది ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐసీయూలో ఉన్నవారి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి.
 

కాగా, కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఫిబ్రవరి 26వ తేదీన 98.80 శాతం రికవరీ రేటు ఉండగా, తాజాగా అది 91.86 శాతానికి పడిపోయింది. కేసులు భారీగా పెరుగుతుండటంతో మొత్తం 3 వేల ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు నిర్వహించేలా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హోం సంఘాల ప్రతినిధులతోనూ, యాజమాన్యాలతోనూ సమావేశాలు నిర్వహించింది. 20 పడకలున్న అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు అందేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి బుధవారం కూడా మంత్రి ఈటల రాజేందర్‌ మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కలిపి 50 వేల పడకలు కరోనాకు కేటాయించేందుకు రంగం సిద్ధం చేశామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. వాటిల్లో కొన్ని పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం ఉండేలా చర్యలు చేపడుతున్నారు.  

ఒక్కరోజులో ఎనిమిది మంది మృతి 
మంగళవారం ఉగాది పండుగ కావడంతో నిర్దారణ పరీక్షల సంఖ్య తగ్గింది. ఆ రోజు 72,364 పరీక్షలు జరగ్గా, అందులో 2,157 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన కరోనా బులిటెన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు 1,12,53,374 నిర్దారణ పరీక్షలు చేయగా 3,34,738 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 361 మంది కరోనా బారినపడ్డారు. తాజాగా 821 మంది కోలుకోగా, ఇప్పటివరకు 3,07,499 మంది రికవరీ అయ్యారు. ఒక రోజులో ఎనిమిది మంది మరణించారు. ఈ మధ్యకాలంలో ఇంతమంది కరోనాతో చనిపోవడం ఇదే తొలిసారి. మొత్తంగా ఇప్పటివరకు కరోనాతో 1,780 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.

కరోనా వ్యాక్సినేషన్‌ పండుగ రోజు ఎక్కువగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా చోట్ల నిలిపివేశారు. 45 ఏళ్లు పైబడిన వారు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కలిపి మంగళవారం ఒక్కరోజులో మొదటి డోస్‌ 31,077 మందికి టీకా వేశారు. రెండో డోస్‌ 2,506 మందికి వేశారని శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలావుంటే జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు మొదటి డోస్‌ తీసుకున్నవారు 20,10,611 మంది కాగా, రెండో డోస్‌ తీసుకున్నవారు 3,12,340 మంది ఉన్నారు. అంటే మొత్తం మొదటి, రెండో డోస్‌ టీకాల సంఖ్య 23,22,951కు చేరింది. కాగా, 2.48 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయని తెలిపారు.

చదవండి: టీచర్ల భర్తీ ఎలా? 

     

మరిన్ని వార్తలు