‘కార్పొరేట్‌’కు దీటు సిద్దిపేట స్కూల్‌

18 Jan, 2021 02:27 IST|Sakshi
ఆన్‌లైన్‌ బోధన చేస్తున్న ఉపాధ్యాయులు

బడి నేర్పిన పాఠం

స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల

సాక్షి, సిద్దిపేట: డిజిటల్‌ తరగతి గదులు.. ‘గూగుల్‌’బోధన అంతా కార్పొరేట్‌ పాఠశాలలకే పరిమితం.. అయితే వాటిలో చదవాలంటే సంవత్సరానికి లక్షల రూపాయలు చెల్లించాల్సిందే.. కానీ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాల ‘కార్పొరేట్‌’కు దీటుగా బోధన సాగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఉపాధ్యాయులే తిరిగి బడిలో చేర్పిస్తుంటే.. ఇక్కడ మాత్రం గతేడాది జూన్‌ రెండో వారంలోనే పాఠశాలల్లో ప్రవేశాలు లేవు.. అన్ని క్లాసుల్లో సీట్లు భర్తీ చేశామని బోర్డులు పెట్టిన సంఘటనలున్నాయి.. నిత్యనూతన ఒరవడిని ప్రవేశపెట్టే ప్రధానోపాధ్యాయుడు, అధునాతన పద్ధతుల్లో బోధించే ఉపాధ్యాయులు.. పాఠశాలకు ఏం కావాలన్నా క్షణాల్లో సమకూర్చే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు.. ఇలా అందరి అంకితభావంతో నడిచే ఆ స్కూల్‌లో చదవడమే వరంగా విద్యార్థులు భావిస్తారు.    

ట్యాబ్‌లు సమకూర్చిన మంత్రి హరీశ్‌రావు
ఇందిరానగర్‌ పాఠశాలలో టెన్త్‌ విద్యార్థులు 187 మంది ఉన్నారు. వీరిలో స్మార్ట్‌ఫోన్లు లేని దాదాపు 40 మందికిపైగా విద్యార్థులకు మంత్రి హరీశ్‌తో పాటు ఆయన ప్రోద్బలంతో మరికొందరు దాతలు ట్యాబ్‌లను సమకూర్చారు. అలాగే, 12 మంది ఉపాధ్యాయులకు కూడా సెల్‌ఫోన్లు కొనుగోలు చేసి ఇచ్చారు. ‘గూగుల్‌’బోధనకు సంబంధించి ప్రధానోపాధ్యాయుడి వద్ద ‘మాస్టర్‌ కీ’ఉంటుంది. దీని ద్వారా ప్రత్యేకించి టెన్త్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన ఎలా సాగుతుందో.. ఉపాధ్యాయులు ఏం చెబుతున్నారు.. విద్యార్థుల ప్రగతి ఎలా ఉందో స్వయంగా పర్యవేక్షిస్తారు. మొత్తం బోధన ప్రక్రియ అంతా ఆయన కనుసన్నల్లోనే కొనసాగుతుంది. రోజూ ప్రధానోపాధ్యాయుడు సబ్జెక్టుల్లో వెనుకబడిన, ఆన్‌లైన్‌లో ఇబ్బందులు పడుతున్న 10 మంది విద్యార్థులను గుర్తించి.. వారితో పాటు వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తారు.

ముందుగా శిక్షణ..
కరోనా విద్యార్థుల విలువైన భవిష్యత్‌ను నాశనం చేసింది. సామాజిక దూరం పేరుతో ఇప్పటివరకు స్కూళ్లు తెరుచుకోలేదు. అయితే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కలసి వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారు. గూగుల్‌ ఇన్‌పుట్‌ టూల్స్‌ ద్వారా ఎక్కడ ఏ లోటు రాకుండా బోధన సాగిస్తున్నారు. అయితే ఇందుకోసం ముందుగా 15 రోజులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా విద్యార్థులకు ప్రధానంగా పదో తరగతి విద్యార్థులకు గూగుల్‌ టూల్స్, వాటి వినియోగంపై శిక్షణ ఇచ్చారు. డాక్యుమెంట్స్‌ తయారీ, స్లైడ్స్‌ తయారీ, అస్సెస్‌మెంట్స్‌ అండ్‌ సర్వీస్, లైవ్‌ ఇంటరాక్షన్, మేనేజ్‌ స్టూడెంట్స్‌ వర్క్స్, జూమ్‌లో బోధన, అన్ని సబ్జెక్టుల సిలబస్‌ డౌన్‌లోడ్, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్, నోట్స్, సైన్స్‌ లేబొరేటరీ వినియోగం, సైన్స్‌ వీడియోల పరిశీలన, సోషల్‌ మ్యాప్స్‌–ముఖ్య పట్టణాల గుర్తింపు, క్విజ్‌ పోటీల నిర్వహణ, సోషల్‌ పజిల్స్‌ మొదలైన వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడం, చదివిన అంశాలను యాప్‌లో పొందుపరిచేలా విద్యార్థులను సంసిద్ధం చేశారు. అలాగే కమ్యూనికేషన్‌ స్కిల్స్, సాఫ్ట్‌ స్కిల్స్, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా రీజనింగ్‌ అండ్‌ అర్థమేటిక్స్‌ మొదలైనవి బోధిస్తున్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది డిసెంబర్‌ వరకు పదో తరగతి విద్యార్థుల సిలబస్‌ పూర్తి చేశారు. ఎప్పుడు పరీక్షలు పెట్టినా పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యార్థులు చెబుతున్నారు. 

ప్రతిరోజూ తల్లిదండ్రులతో ముఖాముఖి
విద్యార్థులు ఏం చదువుతున్నారు? సెల్‌ఫోన్‌లో ఏం డౌన్‌లోడ్‌ చేసుకున్నారు? నోట్స్‌ ఎలా సిద్ధం చేస్తున్నారు? వంటి విషయాలు తెలుసుకునేందుకు నిత్యం 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలతో స్కూలుకు వస్తున్నారు. ఫోన్‌ పరిశీలన, అనుమానాలు, సందేహాలను ఉపాధ్యాయుల సమక్షంలో నివృత్తి చేసుకోవడం చేపడుతున్నారు. ఈ సందర్భంగా ‘గూగుల్‌’ క్లాసులు ఉపాధ్యాయులకు తీరిక ఉన్నప్పుడు కాకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమయాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్లో చదివే వారు ఎక్కువగా కూలీలు, వ్యవసాయం చేసే వారి పిల్లలే. దీంతో వారికి ఫోన్లు అందుబాటులో ఉండే సమయాల్లోనే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు.  

ఇబ్బందులు లేకుండా క్లాసులు వింటున్నాం
ముందుగా గూగుల్‌ ఇన్‌పుట్‌ టూల్స్‌ను నేర్చుకున్నాం. ఇప్పుడు సులభంగా పాఠాలు వింటున్నాం. ఏరోజు అసైన్‌మెంట్‌ ఆ రోజు చేసి డాక్యుమెంట్‌ ప్రిపేర్‌ చేసి తిరిగి యాప్‌లో పెడుతున్నాం. టీచర్లు వాటిని దిద్ది మార్కులు వేస్తున్నారు. అసైన్‌మెంట్‌లో ఏమైనా తప్పులుంటే వాటికి వివరణ పెడుతున్నారు. 
– మోహిద్,  పాఠశాల విద్యార్థి

నెలకోసారి స్కూల్‌కు..
ఆన్‌లైన్‌ తరగతుల్లో భాగంగా పిల్లల చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటుంది. పాఠాలెలా చెబుతున్నారు? ఫోన్‌లో ఏం డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు? మార్కులు ఎలా వస్తున్నాయి? మొదలైన విషయాలు తెలుసుకొనేందుకు నెలకోసారి పిల్లలతో స్కూల్‌కు వెళ్తున్నాం. అక్కడ టీచర్లతో మేం మాట్లాడతాం. పిల్లల ప్రవర్తన, ఇతర విషయాలు చర్చిస్తాం.
– రూప, విద్యార్థి తల్లి

సమష్టి కృషితోనే బోధన..
పాఠశాలలోని ఉపాధ్యాయులందరి కృషి ఫలితంగానే ‘గూగుల్‌’బోధన చేపడుతున్నాం. ముందుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. తర్వాత పిల్లలకు శిక్షణ ఇచ్చి టూల్స్‌పై అవగాహన కల్పించాం. కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. నిరుపేద విద్యార్థులకు మంత్రి హరీశ్‌ సహకారంతో ఫోన్లు కొనుగోలు చేసి ఇచ్చాం. మా పాఠశాలకు ఏ అవసరమొచ్చినా అడగ్గానే కాదనకుండా మంత్రి సమకూర్చుతున్నారు. పదో తరగతి సిలబస్‌ ఇప్పటికే పూర్తి చేశాం. విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు.. 
– రామస్వామి, ప్రధానోపాధ్యాయుడు

మరిన్ని వార్తలు