ఎక్కడి వాళ్లక్కడే..మళ్లీ మొదలైన ఆన్‌లైన్‌ బోధన..! వాళ్లకి తప్పని తిప్పలు..

18 Jan, 2022 02:46 IST|Sakshi

ప్రభుత్వం సెలవులను పొడిగించడంతో ఊళ్లలోనే విద్యార్థులు 

ఇంటర్, డిగ్రీ, ఇతర ఉన్నత విద్యా కోర్సుల క్లాసులు ఆన్‌లైన్‌లో 

పాఠశాల విద్యపై స్పష్టత కరువు 

కరోనా నిబంధనలతో స్కూళ్లు నడపాలని డిమాండ్లు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర సర్కారు విద్యార్థుల సెలవులను పొడిగించడంతో సంక్రాంతికి ఊళ్లకెళ్లిన విద్యార్థులు ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోయారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సులను ఆన్‌లైన్‌లో నిర్వహించాలనే స్పష్టత వచ్చినా పాఠశాల విద్యపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంది. అప్పటి వరకూ పదవ తరగతిలోపు విద్యార్థులకు బోధన దూరమయ్యే వాతావరణం నెలకొంది. అయితే ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. నెట్‌కు అందుబాటులో ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వాహకులు ఫోన్లు చేస్తున్నారు.

మరోవైపు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలను కొనసాగించాలనే డిమాండ్‌ వస్తుండగా దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు భిన్నంగా స్పందిస్తున్నా రు. ‘స్కూళ్లు తెరిచినా పిల్లలను ఎలా పంపుతాం’అని కొంతమంది, ‘ఇప్పటికే రెండేళ్లుగా క్లాసులు నడవక విద్యార్థులు నష్టపోయారు. అన్నీ మరిచిపోతున్నారు’అని మరికొంతమంది అంటు న్నారు. కోవిడ్‌ వల్ల సరైన బోధన లేక పిల్లలు నష్టపోతున్నారని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీంతో విద్యా వ్యవస్థలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆన్‌లైన్‌ క్లాసులకు ఇంకా సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు. 

పల్లెల్లో తిప్పలు: ఆన్‌లైన్‌ బోధన పట్ల మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు విముఖత చూపుతున్నారు. తమ ప్రాం తాల్లో నెట్‌ సౌకర్యం లేదని, మొబైల్‌ ద్వారా క్లాసు లు వింటుంటే అంతరాయం కలుగుతోందని చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులే ఇటీవలి ఇంటర్‌ ఫస్టియర్‌లో ఎక్కువగా ఫెయిల్‌ అయ్యారు. ఫస్టియర్‌లో 49% మందే పాసవడానికి ఆన్‌లైన్‌ క్లాసుల్లో అంతరాయం, నెట్‌ సౌక ర్యం లేకపోవడమే కారణమని అధ్యాపకులూ అంగీకరిస్తున్నారు. కోవిడ్‌ కారణంగా సంక్షేమ హాస్టళ్లు కూడా ఓపెన్‌ చేసే వీలుండదని, ఈ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లి పాఠాలు వినడం సమస్యేనని వాళ్లు చెబుతున్నారు. ఇలా నెట్‌ సౌకర్యానికి దూరంగా ఉన్న విద్యార్థులు దాదాపు 2.5 లక్షల వరకూ ఉం టారని ఓ అధికారి అంచనా వేశారు. ఇంటర్, పైస్థాయి విద్యార్థులైతే బంధువుల ఇళ్లకు వెళ్లి చదువుకునే వీలుందని, చిన్న క్లాసుల విద్యార్థులకు తల్లిదండ్రులు ఈ వెసులుబాటు ఇచ్చే వీలుండదని చెబుతున్నారు. 

వేచి చూసే ఆలోచనలో ప్రైవేటు యాజమాన్యాలు 
సంక్రాంతి సెలవుల కోసం ఊరెళ్లిన విద్యార్థులు పట్టణాలకు తిరిగి రావడంపై పునరాలోచన చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు తాముండే ప్రాంతాలకు వచ్చేందుకు సమయం కోరుతున్నారని ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్‌ తెలిపారు. పరిస్థితి తీవ్రమైతే హాస్టళ్లు మూసివేసే ప్రమాదం ఉందనే ఆందోళన వారిలో కన్పిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులకు కొంత సమయం ఇవ్వాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇవన్నీ ఎంసెట్, జేఈఈ, నీట్‌ సహా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.  

ఇలా చేస్తే ప్రమాణాలు పాతర 
కరోనా పేరుతో స్కూళ్లు మూసేస్తే విద్యా ప్రమాణాలు ఘోరంగా దెబ్బతింటాయని తెలంగాణ గుర్తింపు పొందిన స్కూళ్ల యాజమాన్య సంఘం నేతలు కందాల పాపిరెడ్డి, ఎన్‌రెడ్డి అన్నారు. కేసులు ఎక్కువ ఉన్న అమెరికాలోనే మూసేయలేదని, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు నడపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యా మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సెలవులపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. 

స్కూళ్లు తెరిచినా పంపగలమా? 
నా కొడుకు అంబర్‌పేట వివేకానంద ప్రభుత్వ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. నేనుండే ప్రాంతంలో కోవిడ్‌ కేసులు ఎక్కు వగా వస్తున్నాయి. పండగకు భీమవరం వెళ్లిన నా కొడుకును రావొద్దని, అమ్మమ్మ ఇంటి వద్దే ఉండమని చెప్పా. స్కూలు తెరిచినా ఈ పరిస్థితుల్లో ఎలా పంపుతాం? – ముత్యాలరావు, హైదరాబాద్‌  (విద్యార్థి తండ్రి) 

ఇప్పుడే హైదరాబాద్‌ వద్దంటున్నారు 
నేను హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాను. నీట్‌కు ప్రిపేరవుతున్నా. సంక్రాంతికి మహబూబాబాద్‌ దగ్గర ఉండే మా ఊరికి వెళ్లాను. తిరిగి హైదరాబాద్‌ వద్దామంటే మా వాళ్లు పంపట్లేదు. సెలవులు పొడి గించారుగా.. నీట్‌కు ఇంటి వద్దే ప్రిపేరవ్వు అంటున్నారు. పుస్తకాలన్నీ హైదరాబాద్‌ హాస్టల్‌లో ఉన్నాయి. –శ్రావణి (ఇంటర్‌ విద్యార్థిని)   

మరిన్ని వార్తలు