మీకు అర్థమవుతోందా..!

2 Sep, 2020 10:10 IST|Sakshi
కోయచెలకలో విద్యార్థుల ఇంటికి వెళ్లి ఆన్‌లైన్‌ పాఠాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కర్ణన్‌

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. మంగళవారం నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు షురువయ్యాయి. 3 నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. టీ–శాట్, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను వీక్షించారు. విద్యార్థులు పాఠాలు వింటున్నారా.. లేదా..? అనే విషయాన్ని పలు ప్రాంతాల్లో కలెక్టర్‌తో సహా అధ్యాపకులు, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. అంతేకాక.. ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యువల్‌ చేయడంతో వారు కూడా విధుల్లో చేరారు.

సాక్షి, ఖమ్మం: కోవిడ్‌–19 (కరోనా) ప్రభావం కారణంగా మార్చి 15వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. అయితే అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్‌ ఉధృతి తగ్గలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటు పాఠశాలలు, అటు కళాశాలలు తెరిచేందుకు వేచి చూస్తూ వస్తోంది. నెలలు గడుస్తుండటంతో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను గత నెల 27వ తేదీ నుంచే విధులకు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే కళాశాలల్లో కూడా ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్‌ అధ్యాపకులు విధుల్లో చేరడంతోపాటు కాంట్రాక్టు లెక్చరర్లను కూడా విధుల్లోకి తీసుకున్నారు. 

దూరదర్శన్, టీ–శాట్‌ ద్వారా తరగతులు..
ఇళ్లలో నుంచే విద్యార్థులు దూరదర్శన్, టీ–శాట్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు వీక్షించారు. విద్యార్థులు టీ–శాట్‌ యాప్‌ను స్మార్ట్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని తరగతులు విన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సదుపాయం లేని విద్యార్థులకు గ్రామ పంచాయతీల్లో టీవీలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌ తరగతులు వినే సదుపాయం కల్పిస్తారు. తొలిరోజు మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటలకు తెలుగు, 10.30 గంటలకు ఫిజికల్‌ సైన్స్‌ బోధించారు. 7వ తరగతి విద్యార్థులకు 12 గంటలకు తెలుగు, 12.30 గంటలకు లెక్కల సబ్జెక్ట్‌ను బోధించారు. 6వ తరగతి విద్యార్థులకు 2 గంటలకు తెలుగు, 2.30 గంటలకు లెక్కలు, 8వ తరగతి విద్యార్థులకు 3.30 గంటలకు లెక్కలు, 9, 4వ తరగతి విద్యార్థులకు తెలుగు, 4.30 గంటలకు ఫిజికల్‌ సైన్స్‌ బోధించారు. ఇక ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వినేలా పర్యవేక్షించారు. వాట్సాప్‌లో 30 నుంచి 40 మంది విద్యార్థులను గ్రూపుగా తయారు చేసి.. వారికి వాట్సాప్‌ ద్వారా ఏ సమయంలో.. ఏ తరగతి విద్యార్థులకు.. ఏ సబ్జెక్టు బోధిస్తారో తెలియజేశారు. అలాగే ఆన్‌లైన్‌లో విన్న తరగతులకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వాటిని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఫోన్‌ చేసి విద్యార్థులు నివృత్తి చేసుకోవాలని సూచించారు. కాగా.. రఘునాథపాలెం మండలం కోయచెలక, రేగులచెలక గ్రామాల్లో ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌ ఆకస్మికంగా పరిశీలించారు. 

విద్యార్థుల హాజరు తప్పనిసరి: కలెక్టర్‌ కర్ణన్‌
రఘునాథపాలెం: ఆన్‌లైన్‌ తరగతులు వినే విద్యార్థుల హాజరును ప్రతి రోజూ తప్పక తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను ఆదేశించారు. కోయచెలక, రేగులచెలక గ్రామాల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆన్‌లైన్‌ తరగతులను కలెక్టర్‌ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులు పాఠాలు వినేందుకు చేసిన ఏర్పాట్లను, పాఠాలు వింటున్న తీరును డీఈఓ మదన్‌మోహన్, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్‌ఎం అనితాదేవితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. విద్యార్థులు పాఠాలను శ్రద్ధగా వింటున్నారా.. లేదా.. అనే అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి హ్యాబిటేషన్‌కు ఒకరిని బాధ్యులుగా చేసి.. వారి పరిధిలో ఆన్‌లైన్‌ బోధన సక్రమంగా సాగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠ్యాంశాలను శ్రద్ధగా వింటూ నోట్‌ చేసుకోవాలన్నారు. సందేహాలు ఉంటే సంబంధిత సబ్జెక్ట్‌ ఉపాధ్యాయుడికి ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. అన్ని సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయుల సెల్‌ నంబర్లు ప్రతి విద్యార్థి వద్ద అందుబాటులో ఉంచాలని డీఈఓను ఆదేశించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓను ఆదేశించారు. డీటీహెచ్, స్థానిక కేబుల్‌ ఆపరేటర్లు తరగతుల ప్రసారానికి అంతరాయం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి విజయకుమారి, ఎంపీడీఓ వి.ఆశోక్‌కుమార్, గ్రామ సర్పంచ్‌లు మాధంశెట్టి హరిప్రసాద్, రామారావు, ఉప సర్పంచ్‌లు పూర్ణచంద్రరావు, నున్నా వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం అనిత, గ్రామ కార్యదర్శులు సంగీత, శృతి పాల్గొన్నారు.

తరగతులు పర్యవేక్షించాం..
జిల్లాలోని జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు దూరదర్శన్, టీ–శాట్‌ యాప్‌ ద్వారా ప్రారంభమయ్యాయి. ఇటీవల అధ్యాపకులకు ఆన్‌లైన్‌ బోధనపై శిక్షణ ఇచ్చారు. దీంతో విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులను అధ్యాపకులు పర్యవేక్షించారు. సందేహాలుంటే అధ్యాపకులను ఫోన్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చు. – కె.రవిబాబు, ఇంటర్మీడియట్‌ విద్యాధికారి, ఖమ్మం

మరిన్ని వార్తలు