సిలబస్‌ టెన్షన్‌.. బుర్రకెక్కింది అంతంతే... 

17 Jan, 2022 19:17 IST|Sakshi

40 శాతం మించని పాఠ్యాంశాల బోధన

విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం

ఆన్‌లైన్‌ బోధనకు సిద్ధమైన ప్రైవేట్‌ బడుల యాజమాన్యాలు

విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్‌ సందేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: మళ్లీ ఆన్‌లైన్‌ బోధన నేపథ్యంలో సిలబస్‌ పూర్తి కావడం ప్రశ్నార్థకంగా తయారైంది. ఒకవైపు ఉపాధ్యాయులు, మరోవైపు విద్యార్థుల్లో సిలబస్‌ టెన్షన్‌ మొదలైంది. కరోనా నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యం కావడంతో ఉన్నత తరగతులకు సిలబస్‌ 40 శాతం మించలేదు. గురుకుల విద్యాసంస్థల్లో  పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇక ప్రభుత్వ విద్యా సంస్థల్లో సిలబస్‌ కనీసం 20 నుంచి 30 శాతం మించలేదు. గత నెల రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం ప్రత్యక్ష బోధనపై తీవ్ర ప్రభావం చూపించింది. 

బుర్రకెక్కింది అంతంతే... 
ఈ విద్యా సంవత్సరం కూడా పాఠ్యాంశాలపై విద్యార్థులు పట్టు సాధించలేక పోతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మొదటి మూడు నెలలు ఆన్‌లైన్‌ విధానంలో బోధన కొనసాగగా, ఆ తర్వాత నాలుగు నెలల క్రితం విద్యా సంస్థలు పునఃప్రారంభమై ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్‌ నాటికి పూర్తయిన సిలబస్‌ ఆధారంగా గత నెలలో ఎస్‌ఏ– 1 పరీక్షలు నిర్వహించగా పాఠ్యాంశాలపై  విద్యార్థుల పట్టు అంతంత మాత్రంగా బయటపడింది. కనీసం పదో తరగతి విద్యార్థులు సైతం పాఠ్యాంశాలపై పెద్దగా పట్టు సాధించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.  

ప్రాజెక్టులకే పరిమితం 
పదో తరగతి మినహా మిగతా తరగతుల విద్యార్థులు పాఠ్యాంశాలకు బదులు ప్రాజెక్టులకు పరిమితమయ్యారు. పాఠ్యాంశాల బోధన పక్కనపెట్టి  ప్రాజెక్టులు ఇవ్వడం సర్వసాధారణమైంది. వాస్తవానికి సిలబస్‌ 30 శాతం కూడా మించలేదు. ఇక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గత రెండేళ్లుగా చదువులు సరిగా సాగకపోవడంతో విద్యార్థులు పాఠ్యంశాలపై పట్టు సాధించలేకపోయారు. 

ఇక ఆన్‌లైన్‌ తరగతులే..  
► కరోనా మూడో దశ ఉద్ధృతి నేపథ్యంలో విద్యా సంస్థలు మళ్లీ ఆన్‌లైన్‌ సిద్ధమయ్యాయి, సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్‌ సందేశాలు పంపించాయి. తరగతుల షెడ్యూలు కూడా ప్రకటించాయి. (చదవండి: హైదరాబాద్‌లో ఊపందుకున్న రియల్టీ జోరు)

► సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియడంతో తాజా కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థులు నష్టపోకుండా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆరంభంలో  మొదట మూడు నెలల పాటు ఆన్‌లైన్‌ పద్ధతిలో కొనసాగినా బోధన వైరస్‌ ప్రభావం తగ్గుదలతో గత నాలుగు నెలలక్రితం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో అప్పటి నుంచి ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. గత నెల చివరి అంకం నుంచి వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రత్యక్ష బోధన ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో ముందస్తుగా సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. వైరస్‌ ఉద్ధృతి తగ్గక పోవడంతో సెలవులు పొడిగిస్తూ ఆన్‌లైన్‌ తరగతులకు వెసులుబాటు కల్పించింది. (చదవండి: తెలంగాణ కేబినెట్‌ భేటీ: కొత్త చట్టం కోసం..)

మరిన్ని వార్తలు