గిరిజన విద్యార్థుల గోస: పాఠం వినబడదు.. దృశ్యం కనబడదు

5 Jul, 2021 20:46 IST|Sakshi
తిర్యాణి మండలంలో సిగ్నల్‌ కోసం నాలుగు కిలోమీటర్లు వచ్చి తరగతులు వింటున్న బాలిక(ఫైల్‌)

సాక్షి, ఉట్నూర్‌(ఆదిలాబాద్‌): కరోనాతో రెండేళ్లుగా విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఏడాదిన్నరగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఉంటున్నారు. పరీక్షలు రాయకుండానే పైతరగతులకు ప్రమోట్‌ అవుతున్నారు. ఈ (2021–22) విద్యా సంవత్సరం కూడా ఆన్‌లైన్‌ తరగతులతోనే ప్రారంభమైంది. ఈనెల 1నుంచి బోధన షురూ అయింది. అయితే గిరిజన విద్యార్థులకు “తెర’ పాఠాలు చేరడం లేదు. గిరిజన సంక్షేమ శాఖలో విద్యనభ్యసిస్తున్న సుమారు 10 వేల మంది డిజిటల్‌ పాఠాలకు దూరంగా ఉంటున్నారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం లేక, ఫోన్‌ ఉన్నా రీచార్జి చేయించే స్థోమత లేక విద్యార్థులు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి. ప్రత్యామ్నాయంగా గిరిజన సంక్షేమ శాఖ వర్క్‌ షీట్ల విధానానికి శ్రీకారం చుట్టినా ఇప్పటి వరకు టెండర్లు ప్రక్రియే దాటలేదు.  

గిరిజన శాఖ పరిధిలో 126 పాఠశాలలు 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 126 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. 906 గిరిజన ప్రాథమిక, 10 వసతి గృహాలున్నాయి. వీటిలో 35,669 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ఉచిత వసతి, నాణ్యమైన విద్య అందిస్తోంది. కరోనా కారణంగా 2020, మార్చి 23 నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. అప్పటి నుంచి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ విద్యా సంవత్సరం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని విద్యార్థులు ఆశపడ్డారు. అయితే కరోనా సెకండ్‌వేవ్‌ ముప్పు పూర్తిగా తొలగకపోవడంతో ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆన్‌లైన్‌ పాఠాలకు దూరం.. 
ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మందికి టీవీ సౌకర్యం లేదు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగం గురించి చాలా మందికి తెలియదు. ఉన్నవారికి సెల్‌ సిగ్నల్స్‌ అందవు. మరికొందరికి నెలనెలా ఫోన్‌ రీచార్జి చేయించే స్థోమత లేదు. ఇంటర్నెట్‌ సౌకర్యం చాలా గిరిజన గ్రామాలకు అందుబాటులో లేదు. అడపాదడపా వచ్చే సిగ్నల్స్‌తో పాఠం వినబడితే దృశ్యం కనబడదు.. దృశ్యం కనిపిస్తే పాఠం వినపడని పరిస్థితి. ఫలితంగా ఏజెన్సీ పరిధిలోని 9,460 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ చదువులకు దూరంగా ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వర్క్‌షీట్లు, లర్నింగ్‌ కిట్లు అత్యవసరం. వీటిని త్వరగా అందించి తమ పిల్లలు చదువుకు దూరం కాకుండా, పాఠాలు నష్టపోకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నెట్‌వర్క్‌ సమస్య ఉన్న ప్రాంతాల్లో సిగ్నల్స్‌ అందేలా చూడాలని విన్నవిస్తున్నారు.  

టెండర్ల దశ దాటని వర్క్‌షీట్లు..
ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ఆన్‌లైన్‌ తరగతులతో ప్రారంభించడంతో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తమ పరిధిలోని విద్యార్థులకు వర్క్‌షీట్లు, లర్నింగ్‌ కిట్లు పోస్టల్‌ ద్వారా అందించాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన విద్యార్థుల పోస్టల్‌ అడ్రస్‌లు సేకరించారు. అయితే వర్క్‌షీట్ల తయారీ, లర్నింగ్‌ కిట్ల కోసం టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈనెల 7న టెండర్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రక్రియ ముగిసి విద్యార్థులకు వర్క్‌షీట్లు అందాలంటే ఎన్ని రోజుల సమయం పడుతుందో స్పష్టత లేదు. అప్పటి వరకు చిన్నారుల చదువులకు ఆటంకం తప్పేలా లేదు. 

మరిన్ని వార్తలు