సైబర్‌ ఉచ్చు.. సరికొత్త చిక్కు

30 Jan, 2023 05:05 IST|Sakshi

రోజురోజుకూ పెరిగిపోతున్న ఆన్‌లైన్‌ మోసాలు 

కొంగొత్త పద్ధతుల్లో కొల్లగొడుతున్న నేరగాళ్లు 

అత్యాశ, బలహీనతల ఆధారంగా బురిడీ 

సెక్స్‌టార్షన్‌కు చిక్కి కొందరు విలవిల.. 

టూర్‌ ప్యాకేజీలు, ఆఫర్ల వలలో మరికొందరు 

అవగాహన, అప్రమత్తతే ముఖ్యమంటున్న నిపుణులు 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ తర్వాత ఇంటర్నెట్‌ వాడకం, అన్ని రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే పొందడం పెరిగినట్టుగానే, వాటిని ఆధారంగా చేసుకుని జరిగే సైబర్‌ నేరాలూ గణనీయంగా పెరిగాయి. ఎప్పుటికప్పుడు కొత్త పద్ధతుల్లో నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. ఈ ఏడాదిలో మరికొన్ని కొత్త సైబర్‌ నేరాలు తెరపైకి రావచ్చని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే సైబర్‌ నేరాలు కేవలం ఆర్థిక నష్టాన్ని కలిగించడమే కాకుండా సామాజిక జీవితంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. దేశ ఆర్థిక, సామాజిక భద్రతకూ ముప్పుగా పరిణమిస్తున్నాయి. గతంలో ఐటీ, బ్యాంకింగ్, ఎయిర్‌లైన్స్, పవర్‌గ్రిడ్‌ వంటి వ్యవస్థల్లో గమనించగా..ఇప్పుడు అన్ని రంగాలనూ ప్రభావితం చేసే స్థాయికి వెళ్లాయి. నిత్యజీవితంలో ప్రతి అంశానికి ఇప్పుడు సైబర్‌ దాడుల ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. కాస్త అవగాహన, అప్రమత్తతతో వ్యవహరిస్తే వీటికి కళ్లెం వేయొచ్చునని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీల్లో ముఖ్యంగా మూడు రకాలైన మోసాలు జరుగుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

సెక్స్‌టార్షన్‌ నేర విధానం:
►యువతులు వీడియోకాల్స్‌ చేస్తారు. మాటల్లోకి దించి రెచ్చగొడతారు. వీడియో సంభాషణలన్నీ రికార్డ్‌ చేస్తారు. మనం వారి వలల్లో చిక్కుకున్నామని భావించిన తర్వాత వాటిని సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగి, ఆన్‌లైన్‌లో డబ్బులు కొల్లగొడతారు. చాలామంది ఈ విధమైన మోసాల్లో చిక్కుకుంటున్నారు. 

ఏం చేయాలి:  
►అపరిచిత నంబర్ల నుంచి వచ్చే వీడియోకాల్స్‌ను లిఫ్ట్‌ చేయకూడదు. 
►సోషల్‌ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్, ఫొటోలను లాక్‌ (కనిపించకుండా) చేయాలి. మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ పేర్లు కూడా కన్పించకుండా చేయాలి. 
► ఏదైనా పరిస్థితుల్లో సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకున్నా, బాధితులుగా మారినా భయపడొద్దు. వెంటనే మీ సోషల్‌ మీడియా ఖాతాను తాత్కాలికంగా డీ యాక్టివేట్‌ చేయాలి. 

పర్యాటకం పేరిట.. 
నేర విధానం: జంగిల్‌ సఫారీ, పుణ్యక్షేత్రాల సందర్శనకు హెలికాప్టర్‌ ప్రయాణాల పేరిట మోసస్తారు. కోవిడ్‌ తగ్గిన తర్వాత పుణ్యక్షేత్రాల సందర్శన, విహారయాత్రలు పెరిగాయి. దీన్నిఅవకాశంగా తీసుకుని పర్యాటకుల్ని సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. వివిధ ఆకర్షణీయమైన టూర్‌ ప్యాకేజీలు, ఆఫర్ల పేరిట ఆకర్షిస్తున్నారు. ఆన్‌లైన్‌లో డబ్బులు కాజేసిన తర్వాత కానీ అలాంటి సంస్థలేవీ లేవనితెలియడం లేదు. 

ఏం చేయాలి: 
►బ్యాంకు లావాదేవీలైనా సరే ఆన్‌లైన్‌లో చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి.  
►అనుమానాస్పద వెబ్‌సైట్ల జోలికి అస్సలు వెళ్లకూడదు. ఊరూపేరూ లేని వెబ్‌సైట్లలో యాత్రలు బుక్‌ చేసుకోకూడదు. అన్నీ కచ్చితంగా నిర్ధారించుకున్నాకే ముందుకెళ్లాలి. ►రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక టూరిజం వెబ్‌సైట్లలో బుక్‌ చేసుకోవడం ఉత్తమం. 
►ఒకవేళ సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తిస్తే.. 24గంటల లోపే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేయాలి. అలాచేస్తే నేరగాళ్లు కొట్టేసిన సొమ్మును బ్యాంకులు ఫ్రీజ్‌ చేసే అవకాశం ఉంటుంది. 

క్లిక్‌ చేయొద్దు..డౌన్‌లోడ్‌ వద్దు  
మనకు వచ్చే ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్‌లో అనుమానాస్పద యూఆర్‌ఎల్, వెబ్‌ యూఆర్‌ఎల్‌ ఉంటే వాటిపై క్లిక్‌ చేయవద్దు. అలాగే మనకు తెలియని ఈమెయిల్‌ ఐడీల నుంచి వచ్చే లింక్‌లు, అటాచ్‌మెంట్లు డౌన్‌లోడ్‌ చేయవద్దు. సోషల్‌ మీడియాలో వచ్చే యాడ్స్‌ను నమ్మకండి.  
– ప్రసాద్‌ పాటిబండ్ల, సైబర్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణులు, న్యూఢిల్లీ 

2022లో నమోదైన కొన్ని నేరాలు పరిశీలిస్తే..
►కొన్ని ఈ మెయిల్స్‌పై క్లిక్‌ చేయగానే అవి ఫిషింగ్‌ వెబ్‌సైట్ల (సైబర్‌ నేరగాళ్లవి)లోకి వెళ్లేలా చేస్తాయి.  
►వెబ్‌సైట్లలో ఫేక్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్లు పెడతారు. ఏదైనా సాయం కోసం వాటికి కాల్‌ చేసిన వారిని ఎనీడెస్క్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునేలా చేసి డేటాను చోరీ చేస్తారు. 
►పలు ప్రముఖ ఫాస్ట్‌ ఫుడ్‌ ఫ్రాంచైజీల పేరిట ఫేక్‌ వెబ్‌సైట్లను పెట్టి, వాటిలో భారీ డిస్కౌంట్లపై ఫుడ్‌ అందజేసే పేరిట మోసగిస్తారు.  
► ఆదాయ పన్ను ఫైల్‌ చేయాలంటూ నకిలీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌ లింకులను పంపుతారు. వాటి నుంచి కస్టమర్ల డేటాను, అవతలి వాళ్లు అమాయకులైతే డబ్బులు కొల్లగొడతారు.  
►ఉచితంగా కోవిడ్‌ పరీక్షల పేరిట ముందుగా కొంత మొత్తం చెల్లించాలని చెప్పి, తర్వాత రిమోట్‌ యాక్సెస్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ డబ్బు మీకు వాపస్‌ అంటూ మోసగిస్తారు.  
►ఓఎల్‌ఎక్స్‌ వంటి వెబ్‌సైట్లలో మిలిటరీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లా నకిలీ ఐడీ కార్డులు అప్‌లోడ్‌ చేసి వస్తువుల కొనుగోలు, అమ్మకాల పేరిట బురిడీ కొట్టిస్తున్నారు.  
►ఎక్కువ విదేశీ ఖాతాలకు పెద్ద మొత్తాలు పంపే వ్యాపార కంపెనీలు, వ్యాపారవేత్తలను టార్గెట్‌గా చేసుకుని మోసాలు (బిజినెస్‌ ఈ–మెయిల్‌కాంప్రమైజ్‌ (బీఈసీ) చేస్తున్నారు.
►సోషల్‌ ఇంజనీరింగ్‌ టెక్నిక్‌లు లేదా కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్షన్‌ టెక్నిక్‌లు వాడి బిజినెస్‌ ఈ మెయిల్స్‌ను హ్యాక్‌ చేస్తున్నారు..

కోవిడ్‌ వ్యాక్సిన్, సర్వేలు, రివార్డ్‌లు 
నేర విధానం: ఇటీవలి కాలంలో నేరగాళ్లు కోవిడ్‌ వ్యాక్సిన్‌ సర్వే, ఎన్నికల సర్వేలో పాల్గొని రివార్డులు గెలుచుకోండి అంటూ కొన్ని లింక్‌లను పంపుతున్నారు. రివార్డులనగానే చాలామంది ఆకర్షితులవుతున్నారు. వాటిపై క్లిక్‌ చేస్తే మన సమాచారం అంతా వారికి చేరిపోయేలా, లేదంటే మన మొబైల్‌ ఫోన్లలో రిమోట్‌ యాక్సెస్‌ యాప్‌లు ఇన్‌స్టాల్‌ అయ్యేలా చేస్తున్నారు.  

అవగాహన: 
►అనుమానాస్పద ఎస్‌ఎంఎస్‌ లింక్‌లను (దీనిని స్మిషింగ్‌ అంటాం) క్లిక్‌ చేయకూడదు. 
►వాయిస్‌ కాల్స్‌ (విషింగ్‌) అటెండ్‌ చేయవద్దు. అనుమానాస్పద నంబర్లను వెంటనే బ్లాక్‌ చేయాలి. 

2,37,658 ఫిర్యాదులు  
►కేంద్ర హోంశాఖ అధికారిక మ్యాగజైన్‌ ‘సైబర్‌ ప్రవాహ’ప్రకారం సైబర్‌ నేరాలకు సంబంధించి కొన్ని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. 
►నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ) సమాచారం ప్రకారం 2022 ఏడాది రెండో త్రైమాసికం వరకు సైబర్‌ నేరాలపై 2,37,658 ఫిర్యాదులు అందాయి 
►ఎన్‌సీఆర్‌పీలో ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు 7.08 లక్షల మంది సైబర్‌ నేరగాళ్ల వివరాలను సేకరించి డేటాబేస్‌ రూపొందించారు. 
►సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన రూ.95 కోట్లను వారి ఖాతాల్లోకి చేరకుండా సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్స్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌)
కింద బ్యాంకులు ఆ డబ్బును నిలిపివేసాయి.  
►సైబర్‌ దోస్త్‌ ట్విట్టర్‌ ఖాతా ద్వారా సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేలా ఇప్పటివరకు 1,263 ట్వీట్లను అధికారులు షేర్‌ చేశారు. ఈ ట్విట్టర్‌ ఖాతాను 3.97 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 

జాగ్రత్తలు పాటించాలి.. 
►డబ్బులపై ఆశ, బలహీనతల కారణంగానే ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువత అందునా విద్యార్థులు మోసపోతున్నారు. మనం లాటరీలో పాల్గొనకుండా, ఎలాంటి బహుమతీ రాదని గుర్తించాలి.  

►ఈమెయిల్స్, సోషల్‌ మీడియా ఖాతాలకు ‘టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌’(పాస్‌వర్డ్‌తో పాటు ఓటీపీ వచ్చేలా) పెట్టుకోవాలి.  
►వెబ్‌సైట్లలో మీ యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌లు సేవ్‌ చేసుకోవద్దు.  
►మీ పిల్లల సోషల్‌ మీడియా ఖాతాల్లో మీరు కూడా ఫ్రెండ్‌గా ఉండడం ఉత్తమం. ఆన్‌లైన్‌లో పిల్లలు ఎవరితో స్నేహాలు చేస్తున్నారో గమనిస్తుండాలి.  

►సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఏ విధంగా మోసపోయి­నా, వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, టోల్‌ఫ్రీ నంబర్‌ 155260 లేదా 1930లో, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.  

మరిన్ని వార్తలు