రమ్మీ విస్ఫోటం

5 Feb, 2022 03:16 IST|Sakshi

రాష్ట్రంలో మళ్లీ పడగ విప్పుతున్న ఆన్‌లైన్‌ రమ్మీ

నిషేధం ఉన్నా బరితెగించిన ముంబై రమ్మీ మాఫియా

కొత్తగా యాప్‌లు వదిలి సోషల్‌ మీడియాలో భారీ ప్రకటనలు

పేకాట ఆడుతూ రూ. కోట్లు పోగొట్టుకుంటున్న యువత

గతంలో ఫేక్‌ లొకేషన్‌తో ఆట.. ఇప్పుడు నేరుగానే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్ల కిందటే నిషేధం విధించిన ఆన్‌లైన్‌ రమ్మీ మళ్లీ పడగ విప్పుతోంది. రాష్ట్రంలో నిషేధం ఉన్నా ముంబై ఆన్‌లైన్‌ రమ్మీ మాఫియా కొత్త యాప్‌లను తాజాగా రాష్ట్రంలోకి వదిలింది. నెల రోజుల నుంచి సోషల్‌ మీడియాలో భారీగా ప్రకటనలు ఇస్తోంది. దీంతో లక్షలాది మంది యువత వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకొని ఆడుతూ రూ. కోట్లు పోగొట్టుకుంటున్నారు. గతంలో ఫేక్‌ లొకేషన్‌తో జూదరులు ఆట ఆడగా..

ఇప్పుడు నేరుగానే పేకాట ఆడేలా యాప్‌లను మాఫియా తీసుకొచ్చింది. గేమింగ్‌ యాక్ట్‌ను సవరిస్తూ, ఆన్‌లైన్‌ రమ్మీని బ్యాన్‌ చేస్తూ చట్టం తీసుకొచ్చినా బరితెగించి యాప్‌లు వదిలిన రమ్మీ మాఫియాపై ప్రభుత్వ యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి.

సోషల్‌ మీడియా వేదికగా..
ముంబైకి చెందిన ప్రముఖ రమ్మీ సంస్థ డ్యాష్‌ రమ్మీ, రమ్‌ రమ్మీ, రోజ్‌ రమ్మీ యాప్‌లను రూపొం దించింది. డబ్బు లేకపోతే రమ్మీ ఆడి గెలుచు కోవచ్చని, సులభంగా సంపాదించు కోవచ్చని యూట్యూబ్, ఫేస్‌బుక్‌ తదితర మా«ధ్యమాల్లో ప్రకటనలిచ్చింది. గతంలో ఆన్‌లైన్‌ రమ్మీ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకున్నా రాష్ట్రం లొకేషన్‌ ఉండటం వల్ల ఆడేందుకు అనుమతి వచ్చేది కాదు. దీంతో ఫేక్‌ లొకేషన్‌ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకొని నకిలీ లొకేషన్‌తో రమ్మీ ఆడేవారు. అయితే ఈ 3 యాప్స్‌లో ఇలాంటి ఆప్షన్‌ లేదు. ఈ–మెయిల్, మొబైల్‌ నెంబర్‌తో రిజిస్టర్‌ చేసుకొని నేరుగా గేమ్‌లోకి వెళ్లేలా అవకాశం కల్పించారు. డబ్బులు జమ చేసి ఆడాలి

♦ ఓసారి రిజిస్టర్‌ అయ్యాక పేకాట ఆడేందుకు డబ్బులు జమ చేసుకోవాలి. ఇందుకోసం యూపీఐ (ఫోన్‌ ఫే, గూగుల్‌ పే) ద్వారా రూ.50 నుంచి 10వేల వరకు యాడ్‌ చేసుకునేలా ఆప్షన్‌ ఇచ్చారు. 

♦ డబ్బు జమయ్యాక పాయింట్‌ రమ్మీ, పూల్‌ రమ్మీ, డీల్స్‌ అని మూడు రకాల పేకాట ఆప్షన్‌ వస్తుంది. వాటిలో ఎంపిక చేసుకొని డబ్బులు పెట్టి ఆడాలి. 

♦ డబ్బులు వస్తే విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. ఇందుకు యాప్‌లో ప్రొఫైల్, కేవైసీ, అడ్రస్‌ ఫ్రూఫ్‌ అడుగుతున్నారు. ఆధార్, పాస్‌పోర్టు, ఓటర్‌ ఐడీ, బ్యాంకు వివరాల్లాంటివి అప్‌లోడ్‌ చేశాక ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ సక్సెస్‌ ఫుల్‌ అని వస్తుంది. ఆ తర్వాతే డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. బ్యాంకు లేదా యూపీఐ ద్వారా డబ్బు తీసుకోవాలని యాప్‌ సూచిస్తుంది. 

♦ డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌.. పలు రాష్ట్రాల్లో బ్యాన్‌ ఉం దని యాప్‌లో పేర్కొంటున్నారు. అయినా ఆడేలా ఆప్షన్‌ కల్పించడం వివాదాస్పదమవుతోంది. 

బరితెగించినట్టా.. లేక డీల్‌ సెటిలైందా?
ఆన్‌లైన్‌ రమ్మీ దందా చేస్తున్న మాఫియా గతంలో అనుమతి ఉన్న రాష్ట్రాల లొకేషన్స్‌తోనే గేమ్‌లోకి అనుమతించేవి. ఇప్పుడు కొత్త యాప్స్‌ను రాష్ట్రం లోకి వదలడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. 6 నెలల క్రితం ముంబైకి చెందిన ప్రముఖ ఆన్‌లైన్‌ రమ్మీ సంస్థ, ఆన్‌లైన్‌ రమ్మీకి చెందిన కీలక సూత్రధారి.. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీకి సడలింపులు లేదా దొంగచాటున అనుమతి ఇచ్చేలా ఓ నేతతో రూ.70 కోట్లకు డీల్‌ చేసుకు న్నట్టు ఇంటలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించినా ఇప్పుడు ఈ ఆన్‌లైన్‌ రమ్మీ పగడ విప్పడంతో వెనుకున్నది ఎవరని చర్చ జరుగుతోంది. 

మొదట్లో వచ్చాయి.. తర్వాత పోయాయి
జనవరి 14న ఆన్‌లైన్‌ రమ్మీ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నా. అడ్రస్‌తో సహా అన్ని సబ్మిట్‌ చేసి గేమ్‌ ఆడాను. ఇప్పుడూ ఆడుతున్నా. రెండ్రోజుల కిందట రూ.3 వేలు వచ్చాయి. డబ్బులు వస్తున్నాయని ఆడుతుంటే రూ.3 వేలతో పాటు మరో రూ.2 వేలు కూడా పోయాయి. నాకు తెలిసిన ఫ్రెండ్స్‌ ఓ 50 మంది వరకు ఆడుతున్నాం. 
– వెంకటేశ్, హైదరాబాద్‌

అప్పుడు ఫేక్‌ లొకేషన్‌తో ఆడా..
గతంలో ఆన్‌లైన్‌ రమ్మీ రాష్ట్రంలో ఆడేందుకు ఫేక్‌ లొకేషన్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునేవాళ్లం. ఇప్పుడు డ్యాష్‌ రమ్మీలో ఆ ఇబ్బంది లేదు. కానీ ఆధార్‌ కార్డు, బ్యాంకు ఇతర వివరాలు అడగడం భయంగా ఉంది. డబ్బును విత్‌డ్రా సమయంలో రాష్ట్రంలో బ్యాన్‌ ఉందంటూనే ఇక్కడి లొకేషన్‌లోనే యాప్‌ ఓపెన్‌ అవడం ఆశ్చర్యం. 
శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్‌ 

మరిన్ని వార్తలు