ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ రమ్మీ

28 Jan, 2021 08:18 IST|Sakshi

అప్పులపాలై యువకుడి ఆత్మహత్య

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌): ఇటీవల ఆన్‌లైన్‌ వాడకంతో చాలా విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌ రుణాల యాప్‌లతో భారీగా నష్టపోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా.. మరికొందరు ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసలై అవి లేకపోతే తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌లో పేకాట ఆడుతూ భారీగా నష్టపోయి తీవ్ర అప్పులపాలై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా పడ్తనపల్లిలో జరిగింది.

హాజీపూర్‌ మండలం పడ్తనపల్లికి చెందిన చిందం పోశెట్టి (32) కి భార్య సుకన్య, కుమారుడు మన్విత్‌ (4) ఉన్నారు. పోశెట్టి ఆన్‌లైన్‌ రమ్మీ కల్చర్‌ తరచూ ఆడేవాడు. దీంట్లో బెట్టింగ్‌కు అలవాటుపడి పోశెట్టి అప్పుల పాలయ్యాడు. అయితే ఆన్‌లైన్‌ జూదం ఆడొద్దని తల్లిదండ్రులు, భార్య మందలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పేకాట ఆడుతూ అప్పులు పెరిగాయి. అప్పులు ఇచ్చిన వారు తీర్చాలని ఒత్తిడి పెంచడంతో పోశెట్టి మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం రాంపూర్‌ విద్యారణ్య ఆవాస విద్యాలయం వెనుక మైదానంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలిస్తుండగా మైదానంలో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఆలోపే అతడు మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హాజీపూర్‌ ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు