Hyderabad: ద్విచక్ర వాహనాలే టాప్‌.. మెట్రోకు ఆదరణ అంతంతే !

22 Nov, 2022 17:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ పరిధిలో ఇప్పటికీ ప్రజా రవాణాలో సింహభాగం వాటా ద్విచక్ర వాహనాలదే కావడం విశేషం. నిత్యం సిటీలో వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగించే వారు 39 శాతం ఉండగా.. బస్సుల్లో జర్నీ చేసే వారు 34 శాతం ఉన్నారు. ఇక ఆటోలు, క్యాబ్‌ల్లో రాకపోకలు సాగించేవారు 17 శాతం మంది.. మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లలో జర్నీ చేసేవారు కేవలం 10 శాతం మించకపోవడం గమనార్హం. నగరంలో కాలుష్యాన్ని, కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మెట్రో ప్రజల ఆదరణను చూరగొనలేకపోయింది. 
 

ఇవే శాపం.. 

► నగర మెట్రో నిర్మాణ, నిర్వహణ వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. ఒక కిలోమీటరు మేర ఎలివేటెడ్‌ మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.272 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నగర మెట్రో నిత్యం రూ.కోటి నష్టంతో నెట్టుకొస్తోంది. మెట్రో డిపోలు, స్టేషన్లు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, సాంకేతిక నష్టాలను అరికట్టేందుకు ఎక్కువ వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
  

► ఇక రెండో దశ మెట్రో ఏర్పాటుకు అవసరమైన రూ.8,400 కోట్లు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఆ స్థాయిలో నిధులు విడుదల చేసే పరిస్థితులో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రెండో దశ మెట్రో మార్గాన్ని పబ్లిక్‌– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశంపై పలు అనుమానాలు నెలకొంటున్నాయి. 


మెట్రోతో కాలుష్యం తగ్గిందిలా.. 

► గతేడాది సరాసరి లెక్కను పరిశీలిస్తే సుమారు 3.8 కోట్ల కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు నగర వాతావరణంలో చేరకుండా మెట్రో నివారించడం విశేషం. నగర మెట్రో రైళ్లు విద్యుత్‌ ఆధారంగా పని చేస్తున్న విషయం విదితమే. స్టేషన్లలో విద్యుత్‌ అవసరాలకు సౌర విద్యుత్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. మెట్రో రైళ్లు గతేడాది సుమారు 1.6 కోట్ల లీటర్ల ఇంధనాన్ని సైతం ఆదా చేసినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.
  

► మూడు బోగీలుండే మెట్రో రైలులో ఏకకాలంలో 975 మంది ప్రయాణించవచ్చు. ఇక కాలుష్య ఉద్గారాల విషయానికి వస్తే 30 కిలోమీటర్లు మెట్రోలో జర్నీ చేస్తే కేవలం 190 కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ కాలుష్యం విడుదల అవుతుంది. అదే బస్సులో కేవలం 50 మంది ప్రయాణించవచ్చు. కాగా.. ఒక మెట్రో రైలులో ప్రయాణించేవారి సంఖ్య 20 సిటీ బస్సులతో సమానం. వీటిలో జర్నీ చేస్తే ఏకంగా 405 కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలై పర్యావరణ హననం జరుగుతోంది.
  

► ద్విచక్ర వాహనంపై ఇద్దరు జర్నీ చేసే వీలుంది. సుమారు 975 మంది జర్నీ చేయాలంటే 488 వాహనాలు అవసరం. వీటిపై 30 కిలోమీటర్లు జర్నీ చేస్తే 730 కిలోల సీఓ 2 కాలుష్యం విడుదల అవుతుంది. కారులో నలుగురు వ్యక్తులు జర్నీ చేయవచ్చు. 975 మంది 30 కి.మీ మేర  జర్నీ చేసేందుకు 244 కార్లు అవసరం అవుతాయి. ఇన్ని కార్లలో జర్నీ చేస్తే ఏకంగా 1200 కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలవుతుందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు చెబుతున్నాయి. అంటే బస్సు, కారు, ద్విచక్రవాహనాలతో సిటీ కిక్కిరిసిపోయి.. పొగచూరుతుండగా.. మెట్రోతో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. (క్లిక్ చేయండి: పంజాగుట్ట టు శంషాబాద్‌.. సిగ్నల్‌ ఫ్రీ)

మరిన్ని వార్తలు